పశ్చిమాసియాలోకి ’డూమ్స్ డే’ విమానాలు’!
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:46 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం రానురాను ప్రపంచానికే విపత్తు కలిగించే దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా వద్ద ఉన్న అత్యంత కీలకమైన విమానాలు పశ్చిమాసియాలో.......
ఈ-6బీ మెర్క్యూరీలను పంపిన అమెరికా
వాషింగ్టన్, మార్చి 16: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం రానురాను ప్రపంచానికే విపత్తు కలిగించే దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా వద్ద ఉన్న అత్యంత కీలకమైన విమానాలు పశ్చిమాసియాలో కనిపించటం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. డూమ్స్ డే (ప్రళయకాల) విమానాలుగా పిలిచే ’ఈ-6బీ మెర్య్కూరీ స్ట్రాటజిక్ ఎయిర్‌బోర్న్ కమాండ్’ విమానాలు తాజాగా పశ్చిమాసియాలో కనిపించాయి. అణ్వాయుధదాడి జరిగి భూమిపై ఉన్న అమెరికా సిగ్నలింగ్, కమాండింగ్ సెంటర్లు ధ్వంసమయ్యే పరిస్థితులు ఉంటేనే సాధారణంగా ఈ విమానాలను రంగంలోకి దించుతారు. ఇవి ఆకాశంలో కదిలే కమాండింగ్ సెంటర్లుగా పనిచేస్తాయి. దేశాధ్యక్షుడు, యుద్ధ శాఖ మంత్రి సభ్యులుగా ఉండే కమాండ్ సెంటర్‌తో అమెరికా దళాల (వ్యూహాత్మక, వ్యూహాత్మకం కాని)తో సమాచార సంబంధాలను కొనసాగించటం ఈ విమానాల ప్రధాన విధి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా దాచి ఉంచిన ఖండాంతర క్షిపణులను ఈ విమానాల నుంచి నేరుగా ఆదేశాలిచ్చి ప్రయోగించవచ్చు. సముద్ర గర్భంలో శత్రువుకు చిక్కకుండా దాగి ఉండే అమెరికా అణు జలాంతర్గాములతో ఈ విమానాల్లోని కమాండింగ్ సెంటర్ల ద్వారా సంభాషించవచ్చు. అత్యవసర సమయంలో అధ్యక్షుడు జారీచేసే ‘టేక్ చార్జ్ అండ్ మూవ్ ఔట్’ (టకమో) ఆదేశాలను నేవీ అణు జలాంతర్గాములకు చేరవేయటం ఈ విమానాల అతి కీలకమైన విధి.
అనేక ప్రత్యేకతలు..
ఈ-6బీ స్ట్రాటజిక్ కమాండ్ విమానాలు ప్రచ్చన్న యుద్ధ కాలం చివరి దశ నుంచి అమెరికాలో సేవలందిస్తున్నాయి. అమెరికా వద్ద ఇలాంటివి 16 ఉన్నాయని అంచనా. 150 మీటర్ల పొడవుండే ఈ విమానం ఖరీదు దాదాపు రూ.130.7 కోట్లు. ఇది 40 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. ఈ విమానాలు నేలకు దిగకుండా ఆకాశంలోనే ఇంధనం నింపుకొంటూ ఏకంగా మూడు రోజులపాటు ఉండగలవు. ఏకబిగిన దాదాపు 7,000 మైళ్లు ప్రయాణించగలవు. వీటిలో అత్యంత శక్తిమంతమైన వెరీ లోఫ్రీక్వెన్సీ (వీఎల్‌ఎఫ్) సందేశాలను ప్రసారం చేసే వ్యవస్థ ఉంటుంది. ఈ విమానాలు రంగంలోకి దిగాయంటే ఏదో పెద్ద విపత్తే జరిగే ప్రమాదం ఉందని అర్థమని యుద్ధ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.