పోప్ బలహీనుడు..ట్రంప్ అంటే భయంలేదు
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:28 AM
ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టి ప్రపంచం మొత్తాన్ని కల్లోలంలోకి నెట్టిన ట్రంప్ తాజాగా క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ 14వ లియోను లక్ష్యంగా చేసుకున్నారు.
పోప్ లియో.. అమెరికా అధ్యక్షుడి మఽధ్య మాటల యుద్ధం
వాషింగ్టన్, ఏప్రిల్ 13: ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టి ప్రపంచం మొత్తాన్ని కల్లోలంలోకి నెట్టిన ట్రంప్ తాజాగా క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ 14వ లియోను లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పోప్ ప్రకటన చేయటంతో ఆయనపై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తాను అమెరికా అధ్యక్ష పదవిలో లేకుంటే.. లియో పోప్ అయ్యేవారే కాదన్నట్లుగా మాట్లాడారు. క్యాథలిక్ చర్చి చరిత్రలో పోప్ పదవి అలంకరించిన తొలి అమెరికా పౌరుడిగా 14వ లియో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గత శనివారం ఆయన వాటికన్ సిటీలోని చారిత్రక సెయింట్ పీటర్స్ బసలికాలో సాయంత్రం ప్రార్థనలు నిర్వహించారు. ఆ సందర్భంగా సందేశం ఇస్తూ.. ‘రక్తంతో తడిసిన చేతులతో ఎన్ని ప్రార్థనలు చేసినా భగవంతుడు ప్రసన్నుడు కాడు.. తాము సర్వ శక్తిమంతులమన్న భ్రమలో కొందరు ఉండటం వల్లనే ఇరాన్ యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఘర్షణలు చెలరేగుతున్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నా అభ్యంతరం లేదనే పోప్ మాకొద్దు. నేరస్తులను, మాదక ద్రవ్యాలను అమెరికాలోకి పంపిన వెనెజువెలాపై మేము దాడి చేయటం భయంకరమైన విషయమన్న పోప్ మాకొద్దు. అధ్యక్షుడిని విమర్శించే పోప్ మాకొద్దు. పోప్ రాజకీయాల జోలికి వెళ్లకుండా.. మతపరమైన విషయాలపై దృష్టి పెడితే మంచిది. ఆయన వామపక్ష భావజాలం వైపు మొగ్గుతున్నారు’ అని ట్రంప్ విమర్శించారు. ట్రంప్ విమర్శలపై పోప్ లియో సోమవారం స్పందించారు. ‘సువార్త సందేశాన్ని వారు (ట్రంప్ యంత్రాంగం) సరిగ్గా అర్థం చేసుకోలేద నుకుంటా. నేను ఈ రాజకీయ చర్చలోకి రాదల్చుకోలేదు. ప్రపంచ శాంతి కోసమే నేను పిలుపునిచ్చాను. ట్రంప్ యంత్రాంగమంటే నాకేమీ భయం లేదు’ అని స్పష్టంచేశారు.