Share News

ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్‌ అతి

ABN , Publish Date - Jul 06 , 2026 | 03:01 AM

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రెండో రోజు, ఆదివారం కొనసాగాయి. ముఖ్యనేతలు, విదేశీ ప్రతినిధుల కోసం టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మోసల్లా మసీదు లోపల శనివారం ఉంచిన ఖమేనీ ...

ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్‌ అతి

  • ఇరాన్‌ నాయకులందరినీ ఒక్క దెబ్బకు చంపేయవచ్చని వ్యాఖ్య

  • శ్రద్ధాంజలి ఘటిస్తున్న వాళ్లవి దొంగ ఏడుపులంటూ వాచాలత

టెహ్రాన్‌, జూలై 5 : ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రెండో రోజు, ఆదివారం కొనసాగాయి. ముఖ్యనేతలు, విదేశీ ప్రతినిధుల కోసం టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మోసల్లా మసీదు లోపల శనివారం ఉంచిన ఖమేనీ పార్థివదేహం ఉన్న శవపేటికను సాధారణ ప్రజల సందర్శనార్థం ఆదివారం మసీదు బయట ఉంచారు. ఇజ్రాయెల్‌- అమెరికా ఫిబ్రవరి 28న చేసిన దాడిలో ఖమేనీతోపాటు మరణించిన ఆయన కుటుంబసభ్యుల శవపేటికలను కూడా పక్కనే ఉంచారు. ఖమేనీ శవపేటికను సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. కంటతడి పెట్టుకుంటూ, ఛాతీపై బాదుకుంటూ ఖమేనీకి నివాళి అర్పించారు. కొందరు ఖమేనీ చిత్రపటాలను ప్రదర్శించగా, కొందరు నల్లజెండాలు ఊపుతూ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజల్లో కొందరు ‘‘మన మాట ఒక్కటే.. ప్రతీకారం’’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, ఈ అంత్యక్రియలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య మరింత అగ్గి రాజేశాయి. అమెరికాలో స్థానిక మీడియాతో ట్రంప్‌ మాట్లాడుతూ... ‘‘అందరూ (ఇరాన్‌ నాయకులు) ఒకే చోట ఉన్నారు. ఒక్క దెబ్బకు అందరినీ చంపేయొచ్చు. కానీ మేము అలా చెయ్యం. ఎందుకంటే మేం అలా చేస్తే చర్చలు జరిపేందుకు అక్కడ ఇంకెవరూ ఉండరు’’ అని అన్నారు. అంతేకాక, ఖమేనీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ కంటతడి పెట్టుకున్న వాళ్లవి దొంగ ఏడుపులని ఎద్దేవా చేశారు. ఖమేనీ అంతిమ సంస్కారాలకు వేలాది మంది తరలిరావడంపై ట్రంప్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘నాకు తెలిసి ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారు. వాళ్లవి దొంగ ఏడుపులు కావొచ్చు’’ అని పేర్కొన్నారు. అంతేకాక, తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్‌ నాయకత్వం వేడుకుంటోందని ట్రంప్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్‌ తీవ్రస్థాయిలో ఖండించింది. అమెరికాకు ఓ నాగరికత, సంస్కృతి, గౌరవం లాంటివి ఉండుంటే అంతిమ సంస్కారాల విలువ తెలిసేదని అర్మేనియాలోని ఇరాన్‌ ఎంబసీ ఎక్స్‌లో ఓ పోస్టు చేసింది. కాగా, ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం ఇరాన్‌లోని మషద్‌ పట్టణంలో గురువారం ఖననం చేయనున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 03:01 AM