ఇరాన్ నౌకలు బయటికొస్తే పేల్చేస్తాం
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:29 AM
హోర్ముజ్ జలసంధిలో సోమవారం సాయంత్రం దిగ్బంధం మొదలైందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రపంచ దేశాలను బ్లాక్‌మెయిల్ చేయకుండా...
హోర్ముజ్ దిగ్బంధం మొదలైంది:ట్రంప్
వాషింగ్టన్, ఏప్రిల్ 13: హోర్ముజ్ జలసంధిలో సోమవారం సాయంత్రం దిగ్బంధం మొదలైందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రపంచ దేశాలను బ్లాక్‌మెయిల్ చేయకుండా, దోపిడీ చేయకుండా ఉండేందుకే ఈ దిగ్బంధం చేపట్టామని తెలిపారు. ‘‘ఇరాన్ నౌకాదళాన్ని నాశనం చేశాం. 158 ఇరాన్ నౌకలు సముద్రం అడుగుకు చేర్చాం.మాకు పెద్దగా ముప్పేమీ కలిగించవన్న భావనతో ఇరాన్‌కు చెందిన కొన్ని చిన్న ఫాస్ట్ అటాక్ నౌకలను మాత్రం వదిలిపెట్టాం. ఇప్పుడు ఆ నౌకలేవైనా మా దిగ్బంధంవైపు వస్తే వెంటనే పేల్చేస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అత్యధికంగా శనివారం 34 నౌకలు హోర్ముజ్ దాటాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ఆరాటపడుతోందని, పాకిస్థాన్‌లో చర్చల తర్వాత దీనిపై పలుమార్లు సంప్రదింపులు జరిపిందని తెలిపారు.
పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న 15 భారత నౌకలు
హోర్ముజ్ జలసంధి మూసివేతకు ముందు 25 భారత నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉండిపోయాయని అధికార వర్గాలు వెల్లడించాయి. క్రమంగా అందులో 10 నౌకలు హోర్ముజ్‌ను దాటి రాగా, మిగతావి అక్కడే చిక్కుకుపోయాయని తెలిపాయి. అందులో ఒక డ్రెడ్జింగ్ నౌక, మరో రసాయనాల నౌకతోపాటు ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ, చమురు ట్యాంకర్లు, కంటైనర్ షిప్‌లు ఉన్నాయని వెల్లడించాయి. ఇప్పుడు అమెరికా కూడా హోర్ముజ్ దిగ్బంధానికి దిగడంతో.. ఆ నౌకలు ఎప్పుడు తిరిగి వచ్చేదీ స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నాయి.