నాకు 8 నోబెల్స్ రావాల్సింది!: ట్రంప్
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:53 AM
ఈ ఏడాది కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆక్రోశం వెళ్లగక్కారు.
వాషింగ్టన్, అక్టోబరు 10: ఈ ఏడాది కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆక్రోశం వెళ్లగక్కారు. శాంతి పురస్కారం తనకు కాకుండా వేరే వ్యక్తికి ప్రకటించడంపై చిందులు తొక్కారు. తనకు మించిన శాంతి దూత ఈ ప్రపంచంలోనే లేడు అన్నట్టు చెప్పుకునే ట్రంప్.. తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంతో నార్వే నోబెల్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పరిష్కరించిన ప్రతి యుద్ధానికి చూసుకుంటే.. తనకు ఎనిమిది సార్లు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉందం టూ తనదైన శైలిలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సిరాక్యూస్ నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అణ్వాయుధాలు కలిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధానికి వెళ్లకుండా నివారించడం ద్వారా తాను 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడానని కూడా చెప్పుకొచ్చారు. ‘‘మీ అధ్యక్షుడిగా నేను ప్రాతినిథ్యం వహిస్తున్న అమెరికాకు నోబెల్ శాంతి బహుమతి దక్కాల్సి ఉంది. అయితే అది జరగలేదు. ఇది నార్వేపై, అలాగే ఈ అవమానకరమైన, సిగ్గుచేటు నిర్ణ యం తీసుకున్న వారిపై చెరిగిపోని మచ్చగా మిగిలిపోతుంది’’ అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకులైన, నిజానికి నాగరికతకు శత్రువులైన కొందరు తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తుల వల్ల నోబెల్ శాంతి బహుమతి అప్రతిష్టపాలైందని వ్యాఖ్యానించారు. తనకు నార్వే ఈ బహుమతి ఇవ్వలేదనే విషయాన్ని తాను మర్చిపోనని ఆక్రోశించారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి భారతీయ మూలాలు కలిగిన, దక్షిణాఫ్రికాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ చీఫ్ నవనీతం పిళ్లైకు వరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘‘యూఎన్‌లో పనిచేసే ఒక ఉదార వ్యక్తికి, నాతో పాటు ఎవరూ ఎప్పుడూ వినని ఒక వ్యక్తికి నోబెల్ బహుమతి ప్రకటించారు’ అంటూ ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు.