ప్రధానిగా నెతన్యాహునే ఎన్నుకోండి
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:11 AM
ఈ నెల 27న ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతు ప్రకటించారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల వేళ ట్రంప్ పిలుపు
భవిష్యత్తు అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ విరోధి కావొచ్చు: నెతన్యాహు
టెల్ అవీవ్, అక్టోబరు 19: ఈ నెల 27న ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతు ప్రకటించారు. ప్రధానిగా నెతన్యాహునే మళ్లీ గెలిపించాలని, మరో నేతను ఎన్నుకుంటే అమెరికా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన ఇజ్రాయిల్ ఓటర్లను హెచ్చరించారు. దశాబ్దాలుగా ముప్పుగా ఉన్న ఇరాన్‌ను ఎదుర్కోవడంలో నెతన్యాహు కీలక భాగస్వామిగా నిలిచారని, ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొనేలా చూశారని ట్రంప్ ప్రశంసించారు. నెతన్యాహు లేకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు రెండేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఇజ్రాయెల్‌పై శత్రుభావం ఉండే వ్యక్తి ఎన్నికయ్యే అవకాశం ఉండొచ్చని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో అమెరికాలో సంభవించే భారీ మార్పులకు సిద్ధపడుతూనే.. భవిష్యత్తులో భారత్, లాటిన్ అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలతో కూటములు ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇజ్రాయెల్ అధికారులకు సూచించారు.