అమెరికాను ముంచెత్తిన మంచు తుపాను
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:06 AM
మంచు తుపాను కారణంగా అమెరికా గడ్డకట్టింది. ఆది, సోమవారాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో పాటు, చలిగాలులు వీస్తుండడంతో జనజీవనం స్తంభించింది.
అడుగులోతులో పేరుకుపోయిన హిమం
స్తంభించిన జనజీవనం..13 మంది మృతి
విమానం కూలి మరో ఏడుగురి దుర్మరణం
వాషింగ్టన్, జనవరి 16: మంచు తుపాను కారణంగా అమెరికా గడ్డకట్టింది. ఆది, సోమవారాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో పాటు, చలిగాలులు వీస్తుండడంతో జనజీవనం స్తంభించింది. వర్షం కూడా మంచు రూపంలోనే పడుతుండడం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. రోడ్లపై మంచు పేరుకు పోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్తు సరఫరా కూడా ఆగిపోయింది. అమెరికాలోని తూర్పు, దక్షిణ రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మంచు తుపాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది. ఆర్కానస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2,100 కి.మీ. మేర అడుగులోతులో మంచు పేరుకుపోవడంతో వాహనాలను నడిపేందుకు అవకాశమే లేకుండా పోయింది. కొన్ని చోట్లయితే రెండు అడుగుల లోతులో మంచు గడ్డలు ఉండడంతో నడవడమే కష్టంగా మారింది. మసాచ్యుయెట్స్ రాష్ట్రంలోని ఫాల్‌మౌత్ వద్ద మంచు పెద్ద షీట్లు రూపంలో కనిపిస్తోంది. ఈ కారణంగా 19,000 విమాన సర్వీసులను రద్దు చేయడమో, ఆలస్యంగా నడపడమో జరిగిందని ఆ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మయినేలోని బాన్‌గోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయివేటు విమానం కూలి ఏడుగురు మరణించగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో భారీగా గాలివీయడంతో ఆ విమానం కుప్పకూలింది. న్యూయార్క్‌లో తీవ్రమైన చలితో కనీసం అయిదుగురు మరణించినట్టు మేయర్ జోహ్రాన్ మమ్దానీ చెప్పారు.