జపాన్‌లో మంచు బీభత్సం.. 35 మంది మృతి..
ABN , Publish Date - Feb 04 , 2026 | 01:47 PM
ఉత్తర జపాన్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. బుధవారం 15 ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంచు కురిసింది. పలు ప్రదేశాల్లో మంచు రెండు మీటర్ల మేర పేరుకుపోయింది. తీవ్ర హిమపాతం కారణంగా రెండు వారాల్లో ఏకంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర జపాన్‌లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర హిమపాతం కారణంగా రెండు వారాల్లో ఏకంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఆకస్మిక గుండె పోట్లకు గురవుతున్నారు. బయట నడవలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం 15 ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంచు కురిసింది. పలు ప్రదేశాల్లో మంచు రెండు మీటర్ల మేర పేరుకుపోయింది. హిమపాతం కారణంగా నిగట ప్రాంతంలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
మంచు కారణంగా ప్రమాదాలకు గురై కొందరు చనిపోతుండగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడుతున్నారు. జనవరి 21వ తేదీన ఓనుమా సిటీకి చెందిన 50 ఏళ్ల ఓ వ్యక్తి ఇంటి పైకప్పు నుంచి జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నగాఓకా సిటీలో 70 ఏళ్ల ఓ వ్యక్తి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.
ప్రభుత్వ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘వాతావరణం ఇప్పుడిప్పుడే వెచ్చబడుతోంది.. అలాగని మీరు బయటకు రాకండి. ఇప్పుడే అధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మంచు దిబ్బలు కరిగి మీద పడే అవకాశం ఉంది. నేల మొత్తం జారుతోంది. హెల్మెట్లు పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యంత అవసరం అయితే తప్ప బయటకు రాకండి. మంచును శుభ్రం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 31 సెకెన్లలో కనిపెట్టండి
మున్సిపోల్స్‌లో ‘సోషల్’ వార్