Gustavo Petro Challenges Trump: దమ్ముంటే మదురోలా నన్నూ పట్టుకో!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:19 AM
వెనెజువెలా అధ్యక్షుడు మదురో తరహాలో తనను పట్టుకొమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సవాల్ చేశారు. ‘ట్రంప్.
ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సవాల్
గతంలో ఇలాగే ట్రంప్‌ను సవాల్ చేసిన మదురో!
న్యూఢిల్లీ, జనవరి 6: వెనెజువెలా అధ్యక్షుడు మదురో తరహాలో తనను పట్టుకొమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సవాల్ చేశారు. ‘ట్రంప్.. రా నన్ను పట్టుకో. ఇక్కడ నీ కోసం వేచి చూస్తున్నా..’ అని పేర్కొన్నారు. ‘‘అమెరికా మాపై బాంబులు వేస్తే.. మా దేశంలోని రైతులంతా పర్వతాల్లో గెరిల్లా పోరాటయోధులుగా మారుతారు. దేశమంతా ప్రేమించే, గౌరవించే అధ్యక్షుడిని వారు బంధిస్తే.. ప్రజలు తమలోని చిరుతపులిని నిద్రలేపుతారు. నేను మళ్లీ ఆయుధం పట్టబోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా దేశం కోసం మరోసారి ఆయుధాలు చేపట్టడానికి సిద్ధం’’ అని గుస్తావో పెట్రో ట్వీట్ చేశారు. గుస్తావో పెట్రో ఒకప్పుడు కమ్యూనిస్టు గెరిల్లా విభాగం నేత 1990వ దశకంలో ఆయన ఆయుధం వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. క్రమంగా ఎదిగి కొలంబియాకు అధ్యక్షుడు అయ్యారు. కాగా, మదురో కూడా కొన్ని నెలల క్రితం దమ్ముంటే తనను పట్టుకోవాలని ట్రంప్‌కు సవాలు చేయడం గమనార్హం.