Share News

క్లాడ్‌ ఏఐతో జీవాయుధాల సృష్టికి యత్నం?

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:45 AM

కత్తితో కూరగాయలు తరగొచ్చు. ప్రాణాలూ తీయొచ్చు. అది ఎవరి చేతిలో ఉందన్నదాని బట్టి దాని వాడకం ఉంటుంది. టెక్నాలజీ కూడా అంతే! ఇది చరిత్ర చెబుతున్న సత్యం!!

క్లాడ్‌ ఏఐతో జీవాయుధాల సృష్టికి యత్నం?

  • చికున్‌గున్యాను మరింత ప్రమాదకరంగా మార్చే ప్రయత్నం.. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ క్షీరదాలకు కూడా సోకేలా చేసే పరిశోధన

  • కొందరి యత్నాలను అడ్డుకున్నామన్న ఆంత్రోపిక్‌

  • క్షిపణి సాంకేతికత అభివృద్ధికి క్లాడ్‌ ఏఐని వాడిన హుతీలు!.. ‘యుద్ధ’ సాఫ్ట్‌వేర్‌ రాయడానికి వాడిన చైనా పరిశోధకుడు

  • ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగపడే డ్రోన్ల సమూహాలను క్లాడ్‌ సాయంతో తయారు చేసేందుకు రష్యన్ల యత్నాలు

  • ఆంత్రోపిక్‌ సంస్థ తాజా ‘థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌’లో వెల్లడి

కృత్రిమ మేధ ప్రభంజనం ప్రపంచాన్ని చుట్టేస్తున్న వేళ.. ప్రమాదకరమైన వ్యక్తులు, వ్యవస్థలు దాన్ని ఎంతగా దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయో తెలుపుతూ ‘ఆంత్రోపిక్‌’ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. జీవాయుధాలను తయారుచేయడానికి కొందరు సైంటిస్టులు.. బాలిస్టిక్‌ క్షిపణులకు అవసరమైన సాంకేతికత కోసం హూతీలు.. తైవాన్‌పై యుద్ధానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ రాయడానికి చైనీయులు.. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం డ్రోన్‌ సమూహాల తయారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు రష్యన్లు.. ఇలా రకరకాల వ్యక్తులు, వ్యవస్థలు క్లాడ్‌ ఏఐని దుర్వినియోగం చేయడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నామని అందులో వివరించింది.

వాషింగ్టన్‌, సెప్టెంబరు 11: కత్తితో కూరగాయలు తరగొచ్చు. ప్రాణాలూ తీయొచ్చు. అది ఎవరి చేతిలో ఉందన్నదాని బట్టి దాని వాడకం ఉంటుంది. టెక్నాలజీ కూడా అంతే! ఇది చరిత్ర చెబుతున్న సత్యం!! సుదూర తీరాలకు త్వరత్వరగా చేరడానికి మానవాళికి ఎంతగానో ఉపయోగపడ్డ విమానాలు.. విద్రోహశక్తుల చేతుల్లో పడి వేలాది మంది అమెరికన్ల ప్రాణాలు పోవడానికి కారణమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలికాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధను సైతం.. అదే తరహాలో విధ్వంసం సృష్టించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించాయని.. మానవాళి మనుగడకే ప్రమాదం కలిగించే జీవాయుధాల తయారీకి ‘క్లాడ్‌’ ఏఐని వాడే ప్రయత్నం కొందరు సైంటిస్టులు చేశారని.. వారి ఉద్దేశాలేంటో స్పష్టంగా తెలియకపోవడం వల్ల, ఆ ప్రయత్నాలను తాము నిరోధించామని ‘ఆంత్రోపిక్‌’ సంస్థ వెల్లడించింది. ‘క్లాడ్‌’ ఏఐని దుర్వినియోగం చేయడానికి కొందరు చేసిన యత్నాల గురించి తెలుపుతూ ‘థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌’ పేరిట గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.


అందులో.. అనుమానిత ప్రభుత్వ ప్రాయోజిత గ్రూపులు, నేరగాళ్లు, గూఢచర్య పరకరాలను విక్రయించేవాళ్లు, ప్రభుత్వాలకు సంబంధించిన ప్రచార సంస్థలు, రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు ‘క్లాడ్‌’ ఏఐని ఎలా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించారో సుదీర్ఘంగా వివరించింది. రకరకాల వ్యక్తులు, వ్యవస్థలు, విద్రోహశక్తులు 2025 డిసెంబరు నుంచి 2026 ఆగస్టు నడుమ క్లాడ్‌ హైకు, సోనెట్‌, ఓపస్‌ మోడళ్లను (ఇవన్నీ క్లాడ్‌ పాత మోడళ్లు. కొత్త మోడళ్లయిన ఫేబుల్‌, మైథోస్‌ల వాడకంపై ఆంత్రోపిక్‌ కఠిన నియంత్రణలు అమలుచేస్తోంది) దుష్ప్రయోజనాలకు వినియోగించేందుకు చేసిన ప్రయత్నాలను తాము ఎలా అడ్డుకున్నామో వెల్లడించింది . అందులో భాగంగానే.. కొందరు శాస్త్రజ్ఞులు జీవాయుధాల తయారీకి క్లాడ్‌ ఏఐని వాడారంటూ ఐదు కేస్‌ స్టడీస్‌ (ఉదాహరణల)ను హైలైట్‌ చేసింది. ఉదాహరణకు.. ఈ ఏడాది మే నెలలో ఒక శాస్త్రవేత్త ‘చికున్‌గున్యా’ వైర్‌సలో మార్పులు చేసి.. దాన్ని మరింత హానికరంగా మార్చడం కోసం ప్రయత్నాలు చేశాడని, ఆ పరిశోధన ఒక సైనిక పరిశోధన సంస్థ కోసం జరుగుతోందని తాము గుర్తించి.. వెంటనే ఆ అకౌంట్‌ను నిషేధించామని ఆంత్రోపిక్‌ తన నివేదికలో పేర్కొంది. అలాగే.. పక్షులకు మాత్రమే సోకే బర్డ్‌ ఫ్లూ వైరస్‌ను.. క్షీరదాలకు కూడా సోకేలా మార్చే ప్రయోగాల కోసం మరోపరిశోధకుడు క్లాడ్‌ సాయం కోరగా.. తాము ఆ ప్రయత్నాలను నియంత్రించినట్టు వెల్లడించింది. ఏఐ వల్ల మానవాళికి కలిగే అతి పెద్ద ముప్పుల్లో.. జీవాయుధాల తయారీ ఒకటని ఆందోళన వెలిబుచ్చింది. ‘‘ఒక వ్యాక్సిన్‌ను తయారుచేయడానికో లేదా వ్యాధిని నయం చేయడానికో ఉపయోగించే సమాచారంతోనే జీవాయుధాలను తయారు చేసే ప్రమాదం ఉంది’’ అని పేర్కొంది.


క్షిపణులు, డ్రోన్ల తయారీలో...

యెమెన్‌లో మిలిటెంట్లు (హూతీలు) ‘ఆయుధాల అభివృద్ధి’కి సంబంధించి మూడు కార్యక్రమాలు నిర్వహించినట్లుగా గుర్తించామని ఆంత్రోపిక్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. వారు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు బదులుగా క్లాడ్‌ ఏఐ సాయంతో.. బహుళ దశల బాలిస్టిక్‌ క్షిపణి, వివిధ రకాల క్షిపణులు, కమోడిటీ ఫోన్‌ క్లాస్‌ ఫ్లైట్‌ కంప్యూటర్‌ను ఉపయోగించే గైడెడ్‌ రాకెట్ల తయారీకి.. క్షిపణులు, రాకెట్లను సరైన మార్గంలో నడపడానికి, వాటి సమతుల్యతను కాపాడడానికి అవసరమైన గైడెన్స్‌, నేవిగేషన్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీకి క్లాడ్‌ ఏఐని వాడారని, కానీ వారి క్షిపణి పరీక్షలు విఫలమయ్యాయని పేర్కొంది. అలాగే, చైనాకు చెందిన ఒక పరిశోధకుడు శత్రుదేశాలపై యుద్ధంలో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి.. రష్యాకు చెందిన కొందరు ఫ్రీలాన్సర్లు స్వయంప్రతిపత్తిగల సైనిక డ్రోన్ల సమూహాల తయారీకి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ తయారీకి క్లాడ్‌ను ఉపయోగించారని వెల్లడించింది. రష్యాకు చెందిన కొందరు సైబర్‌ గూఢచర్యం చేయడానికి.. ఇరాన్‌కు చెందిన ఒక సంస్థ తన ప్రచార అవసరాల కోసం (ప్రాపగాండా) క్లాడ్‌ను ఎలా ఉపయోగించాయో సవివరంగా తెలిపింది. కొందరు దీన్ని ‘ఫేక్‌ డేటింగ్‌ యాప్‌’లను తయారుచేయడానికి వినియోగించగా.. మరికొందరు హోటల్‌ వైఫై స్కామ్‌లు చేయడానికి, వ్యవస్థలను వ్యతిరేకించే అసమ్మతివాదులను గుర్తించడానికి వాడారని వెల్లడించింది. కానీ, ఆ ప్రయత్నాలన్నింటినీ తాము అడ్డుకున్నట్టు తెలిపింది. అయితే.. ఇందులో పేర్కొన్న ఉదాహరణలన్నీ ఆంత్రోపిక్‌ సంస్థ గుర్తించినవి. ఇలా గుర్తించకుండా ఇంకా ఎంతమంది ఎన్నిరకాలుగా క్లాడ్‌ను దుర్వినియోగం చేశారో తెలియదు. కృత్రిమే మేధను (ఏఐ) అభివృద్ధి చేస్తున్న సంస్థలు మానవాళి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయంటూ ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్‌ కాక్సన్‌ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వచ్చిన ఈ నివేదిక.. ఏఐపై ఆందోళనను మరింత పెంచుతోంది. ఆంత్రోపిక్‌ మాత్రమే కాదు.. గూగుల్‌ సంస్థ నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో సైతం.. జీవాయుధాల తయారీకి ‘జెమినై’ మోడల్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయగా తాము అడ్డుకున్నట్టు తెలిపింది.


నెలరోజుల క్రితమే హెచ్చరిక..

దాదాపు నెల రోజుల క్రితం.. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞులు మందులకు లొంగని మొండి బ్యాక్టీరియాపై పోరాటానికి ఏఐ సాయంతో కొత్త వైర్‌సలను సృష్టించారు. మొత్తం 302 రకాల కొత్త వైర్‌సలను వారు ప్రయోగశాలలో అభివృద్ధి చేయగా.. వాటిలో 16 వైర్‌సలు మందులకు లొంగని ఈ-కొలి సూక్ష్మజీవిని సమర్థంగా నిర్మూలించాయి. మంచి కోసమే అయినప్పటికీ.. ఇలా కొత్త వైరస్‏లను సృష్టించే టెక్నాలజీ దుష్టుల చేతుల్లో పడితే పెనుప్రమాదమేనని అప్పట్లోనే పలువురు శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళన నిజమేనని.. ఈ నివేదిక రుజువు చేస్తోంది.

Updated Date - Sep 12 , 2026 | 06:48 AM