‘ఓపెన్’ సీక్రెట్స్
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:59 AM
యుద్ధం అంటే ఒకప్పుడు కత్తులు, బల్లేలు, బాణాలు, గదలు! తుపాకులు, ఫిరంగులు.. తర్వాత దశ! బాంబులు, బాంబర్లు, క్షిపణులు, ఖండాంతర క్షిపణులు, యుద్ధనౌకలు.. తర్వాతి ట్రెండ్.
అమెరికా సైన్యం కదలికలపై చైనా కంపెనీల ఏఐ నిఘా
ఆ సమాచారంతో ఇరాన్ దాడులు
టెహ్రాన్, న్యూయార్క్: యుద్ధం అంటే ఒకప్పుడు కత్తులు, బల్లేలు, బాణాలు, గదలు! తుపాకులు, ఫిరంగులు.. తర్వాత దశ! బాంబులు, బాంబర్లు, క్షిపణులు, ఖండాంతర క్షిపణులు, యుద్ధనౌకలు.. తర్వాతి ట్రెండ్. కృత్రిమ మేధతో పనిచేసే మానవ రహిత యుద్ధ విమానాలు.. ప్రస్తుత దశ.. అని మనం అనుకుంటే పొరపాటే! ఇది డేటా యుగం. ఈ యుగంలో.. సమాచారమే అసలైన సంపద, సిసలైన ఆయుధం.. అని చైనా నిరూపిస్తోంది! హ్యాకింగ్, గూఢచర్యం వంటివాటిపై ఆధారపడకుండా.. ప్రపంచం మొత్తానికీ బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని (‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్’ను) కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించి.. అమెరికన్ యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇరాన్‌కు అందిస్తూ ఇజ్రాయెల్, అమెరికాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది! అన్నివైపుల నుంచి ముక్కలు ముక్కలుగా వచ్చే సమాచారాన్ని చైనాలోని కంపెనీలు ఏఐ సాయంతో గుదిగుచ్చి ఒక స్పష్టమైన చిత్రాన్ని రూపొందించి ఇరాన్‌కు ఇస్తున్నాయి. అమెరికా సైన్యాన్ని, వారి కదలికలను ఒక గాజు గదిలో పెట్టినట్టుగా ప్రపంచానికి చూపిస్తున్నాయి.
ఏమిటా కంపెనీలు?
చైనాకు చెందిన మిజర్ విజన్, జింగాన్ టెక్నాలజీ వంటి ప్రైవేటు కంపెనీలు ‘ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్’ను ఏఐతో విశ్లేషించి.. ఆ సమాచారాన్ని అమ్ముకునే పనిలో ఉన్నాయి. ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే.. నెట్‌లో అందుబాటులో ఉండే వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు, విమానాల లొకేషన్ డేటా, షిప్పింగ్ డేటా వంటి వివరాలు. ఆ సమాచారాన్ని చైనా కంపెనీలు ఏఐ సాయంతో విశ్లేషిస్తున్నాయి. ఈ పద్ధతిలోనే అవి అమెరికా యుద్ధనౌక అబ్రహాం లింకన్ ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి ఇరాన్‌కు తెలిపాయి. సౌదీ అరేబియా, ఖతార్‌లలోని అమెరికా బేస్‌లలో ఎన్ని యుద్ధ విమానాలున్నాయనే సమాచారాన్ని ఇరాన్‌కు అందించాయి (అమ్ముకున్నాయి). ఈ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించిన నాలుగు బీ-2 స్టెల్త్ బాంబర్ల మధ్య జరిగిన రేడియో సంభాషణలను తమ ‘జింగ్‌చీ’ సిస్టమ్ ఇంటర్‌సెప్ట్ చేయగలిగిందని, ఆ బాంబర్లు ప్రయాణించిన మార్గాన్ని ట్రాక్ చేసిందని జింగాన్ సంస్థ సగర్వంగా ప్రకటించుకుంది. జింగాన్ సంస్థ తరహాలోనే చైనాకే చెందిన మిజర్ విజన్ సంస్థ అమెరికా నౌకాదళంపై నిఘా పెట్టింది. అమెరికా యుద్ధనౌకలు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో, ఎప్పుడు ఇంధనం నింపుకొంటున్నాయో ట్రాక్ చేసింది. ఆ ప్రాంతంలో అమెరికా సైనికులు వాడే ఫిట్‌నెస్ యాప్‌లు, సోషల్ మీడియా వంటి పోస్టుల ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి, ఏఐతో విశ్లేషించి ఆ డేటాను ఇరాన్‌కు విక్రయిస్తోంది.
ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్‌పైనే కాదు.. చైనాకు చెందిన ప్రైవేటు కంపెనీలు సమాచారం కోసం క్రౌడ్‌సోర్స్ గూఢచర్యానికి కూడా పాల్పడుతున్నాయి. ఇందుకోసం టెలిగ్రామ్ వంటి యాప్స్‌లో ప్రత్యేకంగా గ్రూపులను నడుపుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన సామాన్యులెవరైనా సరే అమెరికా విమానాల ఫొటోలు తీసి పంపితే వారికి క్రిప్టో కరెన్సీలో పారితోషికాన్ని ముట్టజెబుతున్నాయి. ప్రజలు పంపిన ఫొటోలను, అవి ఎగిరిన ప్రాంతాలను విశ్లేషించడం ద్వారా కూడా సమాచారాన్ని రాబడుతున్నాయి. ఈ చైనా కంపెనీల దెబ్బకు అప్రమత్తమైన అమెరికా.. వాణిజ్య ఉపగ్రహ చిత్రాలను విక్రయించే ప్లానెట్‌ల్యాబ్స్ వంటి సంస్థలపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆయా సంస్థలు పశ్చిమాసియా ప్రాంతానికి.. మరీ ముఖ్యంగా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన తాజా ఉపగ్రహ చిత్రాలను విక్రయించడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అలాగే.. అమెరికా రక్షణ శాఖ తన సైనికులను ‘డిజిటల్ సైలెన్స్’ పాటించాల్సిందిగా ఆదేశించింది. వారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో తమ పనికి సంబంధించిన ఎలాంటి వివరాలూ పెట్టకూడదని నిబంధన విధించింది.
-సెంట్రల్ డెస్క్
‘అబ్రహాం లింకన్’పై దాడి ఇలా..
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా తన నౌకాదళ బలిమిని ప్రదర్శించడానికి యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను అరేబియా సముద్రంలో మోహరించింది. దీన్ని గుర్తించడానికి చైనా కంపెనీలు.. మేఘాలను సైతం చీల్చుకుని చూడగల ఎస్‌ఏఆర్(సింథటిక్ అపెర్చర్ రేడార్) టెక్నాలజీని వినియోగించి, ఆ నౌక ఆకారాన్ని గుర్తించాయి. నౌక నుంచి విమానాలు టేకాఫ్/ల్యాండ్ అయినప్పుడు వెలువడే స్వల్ప రేడియో సంకేతాలను పసిగట్టాయి. ఈ వివరాలన్నింటి ఆధారంగా.. ఆ నౌక ఎంత వేగంతో ఇరాన్ తీరం వైపు కదులుతోందో అంచనా వేసి ఆ సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేశాయి. అప్పుడు ఇరాన్ క్షిపణులు, పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ఈ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది.