పైలట్ లేకున్నా.. 5 టన్నుల బరువు మోసుకెళ్లే కార్గో విమానం
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:37 AM
పైలట్ లేకుండా నడిచే కార్గో(సరుకు రవాణా) విమానం డబ్ల్యూ5000ను చైనాలో మొట్టమొదటిసారిగా విజయవంతంగా పరీక్షించారు.
చైనాలో తయారీ.. పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ, నవంబరు 15: పైలట్ లేకుండా నడిచే కార్గో(సరుకు రవాణా) విమానం డబ్ల్యూ5000ను చైనాలో మొట్టమొదటిసారిగా విజయవంతంగా పరీక్షించారు. దీనిని ఎయిర్ వైట్ వేల్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న ఓర్డోస్ నగరంలో శనివారం పరీక్షించారు. 30నిమిషాల పాటు విమానాన్ని గాల్లో నడిపించారు. పైలట్లు ఉండకపోవడమే ఈ విమానం ప్రత్యేకత. అంటే ఇది భారీ డ్రోన్ విమానం అన్నమాట. ఏకంగా 5టన్నుల బరువును మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఉన్న మరే డ్రోన్ విమానం కూడా ఇంత బరువును మోసుకెళ్లలేదు. కేవలం కార్గో కోసమే దీన్ని తయారు చేశారు. ఇందులో ఒక్కసారి ఇంధనం నింపితే 2,600కి.మీ ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 526కిలోమీటర్లు. విమానం బరువు తక్కువగా ఉండటానికి కార్బన్ కాంపోజిట్ మెటీరియల్‌తో తయారు చేశారు.