భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కాదు
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:48 AM
భారత్, చైనాలు భాగస్వాములుగా ఉండాలే తప్ప, ప్రత్యర్థులుగా భావించుకోకూడదని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ అన్నారు.
భారత్-చైనా బంధంపై వాంగ్ యీ వ్యాఖ్య
బీజింగ్, మార్చి 8: భారత్, చైనాలు భాగస్వాములుగా ఉండాలే తప్ప, ప్రత్యర్థులుగా భావించుకోకూడదని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ అన్నారు. సంబంధాలను అవకాశాలుగా మార్చుకోవాలే తప్ప ముప్పుగా చూడకూడదని చెప్పారు. చైనా పార్లమెంటు అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలను పురస్కరించుకొని ఆయన ఆదివారం వార్షిక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాలూ సరైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలే తప్ప ప్రత్యర్థులుగా చూసుకోకూడదని అన్నారు. రెండు దేశాల మధ్య నాగరికత సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని గుర్తు చేశారు. ముఖ్యమైన ఇరుగుపొరుగు దేశాలని, పరస్పర విశ్వాసం, సహకారం అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. విభేదాలు ఉంటే ఆసియా పునరుజ్జీవానికి ముప్పు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు చూపించిన మార్గంలో ముందుకు వెళ్లాల్సి ఉందని అన్నారు. అన్ని స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని, ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగిందని, ప్రజల మధ్య సంబంధాలు అధికమయ్యాయని వివరించారు. రెండు దేశాలూ ఉమ్మడిగా సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరత నెలకొల్పి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని వాంగ్ అన్నారు.