China Faces Demographic Crisis: మహా పతనం దిశగా చైనా జనాభా!
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:38 AM
అధిక జనాభా అండతో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు.. ఇప్పుడు అతిపెద్ద శత్రువు యుద్ధమో.. ఆర్థికమాంద్యమో కాదు.
వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు.. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక
బీజింగ్, జనవరి 19: అధిక జనాభా అండతో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు.. ఇప్పుడు అతిపెద్ద శత్రువు యుద్ధమో.. ఆర్థికమాంద్యమో కాదు. స్వయంగా ఆ దేశంలో పడిపోతున్న జనాభా. ప్రస్తుతం చైనా తీవ్రమైన ‘జనాభా సంక్షోభం’ అంచున ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎన్‌బీఎ్‌స) సోమవారం విడుదల చేసిన గణాంకాలు డ్రాగన్ దేశాన్ని కలవరపెడుతున్నాయి. వరుసగా నాలుగో ఏడాది జనాభా తగ్గుదల సమస్యతో ఆ దేశం తంటాలు పడుతోంది. దీర్ఘకాలంలో శ్రామికశక్తి తగ్గిపోయి ఆర్థికంగా సంకట స్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా అక్కడి యువత పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటుండడంతో సంతృప్తికర ఫలితాలనివ్వడం లేదు. దీంతో దేశంలో వృద్ధ జనాభా పెరిగి, జననాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
65ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం
ఎన్‌బీఎ్‌స గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే చైనా జనాభా 140.83కోట్ల నుంచి 140. 49కోట్లకు పడిపోయింది. అంటే 33.9లక్షల జనాభా కనుమరుగైంది. 2025లో సుమారు 79.2లక్షల మంది పిల్లలు జన్మించారు. ఈ సంఖ్య 2024 జననాల రేటు(95.4లక్షలు)తో పోలిస్తే 17శాతం తగ్గిందని నివేదిక పేర్కొంది. 1949 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప జనన రేటు ఇదే. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. మరోవైపు చైనా వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులేస్తోంది. 2024 చివరి నాటికి 60ఏళ్లు పైబడిన వారి సంఖ్య 31కోట్లకు చేరగా, 2035 నాటికి 40కోట్లు దాటుతుందని అంచనా. ఓవైపు జననాల రేటు తగ్గుతుంటే, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గతేడాది చైనాలో సుమారు 1.13కోట్ల మంది మరణించారు. గత 50ఏళ్లలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. 65ఏళ్ల క్రితం సంభవించిన ఘోర కరువు తర్వాత, చైనాలో జనాభా ఇంతవేగంగా తగ్గడం ఇప్పుడే జరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు.
యువత ఆలోచనలో మార్పే కారణమా ?
ఈ జనాభా సంక్షోభానికి చైనా కొన్నేళ్లుగా అమలు చేసిన ‘ఒక్కరు ముద్దు’ విధానంతో పాటు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన విప్లవాత్మక మార్పులే మూలకారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జననాల రేటు భారీగా పడిపోతోందని గ్రహించిన డ్రాగన్ దేశం.. 2016లో ఒకే సంతానం విధానానికి స్వస్తి పలికింది. అప్పటి నుంచి ముగ్గురు సంతానం ఉండొచ్చని ప్రకటించడంతో పాటు ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. పిల్లల పెంపకం, విద్య, జీవన వ్యయానికి అయ్యే ఖర్చులు భారీగా పెరగడంతో పిల్లలు కనడానికి యువజంటలు ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వం ఏటా ప్రతిబిడ్డకు సుమారు రూ.1.28లక్షల సబ్సిడీని ప్రకటించింది. కండోమ్‌లపై పన్ను పెంచడం వంటి వినూత్న చర్యల ద్వారా కూడా జననాల రేటు పెంచేందుకు ప్రయత్నించింది. అయితే, 2025 మొదటి మూడు త్రైమాసికాల్లో వివాహాల నమోదులో 8.5శాతం పెరుగుదలను నమోదు చేయడం కొంత సానుకూలాంశమని నివేదిక తెలిపింది. జనాభా తగ్గుదల వేగాన్ని విశ్లేషించిన చైనా ఆర్థిక నిపుణులు.. యువతలో వివాహం పట్ల పెరుగుతున్న విముఖత, ఆర్థిక ఒత్తిడితో పాటు ముఖ్యంగా మహిళల్లో తమ కెరీర్ దెబ్బతింటుందనే ఆందోళనే ఇందుకు ప్రధాన అడ్డంకులుగా మారాయాని వెల్లడించారు.