Share News

ఇనుములో హృదయం మొలిచెనే...!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:17 AM

చైనాలో ఓ రోబో ఒక కాలేజీ అమ్మాయిపై మనసు పారేసుకుంది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఒక యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థులు, హ్యూమనాయిడ్‌ ....

ఇనుములో హృదయం మొలిచెనే...!

  • చైనాలో నిర్వహించిన డాన్స్‌ షోలో ఓ అమ్మాయిని కౌగిలించుకున్న రోబో

బీజింగ్‌, ఏప్రిల్‌ 26: చైనాలో ఓ రోబో ఒక కాలేజీ అమ్మాయిపై మనసు పారేసుకుంది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఒక యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థులు, హ్యూమనాయిడ్‌ రోబోతో సంయుక్తంగా డ్యాన్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొద్దిసేపు విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేసిన రోబో.. ఉన్నట్లుండి వెనుదిరిగి కొద్ది దూరంలో డ్యాన్స్‌ చేస్తున్న ఓ విద్యార్థినిని కౌగిలించుకుంది. ఊహించని ఈ ఘటనతో భయపడిన ఆ అమ్మాయి దానిని దూరంగా నెట్టడానికి ప్రయత్నించినా.. రోబో వదల్లేదు. వెంటనే స్పందించిన నిర్వాహకులు రోబోను అదుపు చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారటంతో రోబోల వినియోగం, భద్రతపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ రోబో తనంత తానుగా ఈ నిర్ణయం తీసుకుందా? లేదంటే ఎవరైనా దానికి అలా చేయాలని ఆదేశాలిచ్చారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోబోలో ముందుగా సిద్ధంచేసి ఉంచిన ప్రోగ్రాం ప్రకారమే అది అలా ప్రవర్తించి ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే, రోబోను తయారుచేసిన కంపెనీతోపాటు, డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ నిర్వాహకులు మాత్రం.. రోబోలోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ప్రోగ్రామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే అది అసాధారణంగా ప్రవర్తించిందని వివరణ ఇచ్చారు. నృత్య ప్రదర్శన జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్లు అధికంగా ఎగురవేయటంతో రోబో సిగ్నళ్లలో అంతరాయం ఏర్పడిందని, అందువల్లే అది అలా ప్రవర్తించిందని దాని తయారీ సంస్థ పేర్కొంది.

Updated Date - Apr 27 , 2026 | 04:17 AM