చైనాలో ఎలక్ట్రిక్ విమానాలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:34 AM
ఎలక్ట్రిక్ విమానాలను కమర్షియల్ సేవల కోసం అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో చైనా కీలక ముందడుగు వేసింది.
విజయవంతంగా నడిపిన ఇద్దరు పైలట్లు
కమర్షియల్ సేవలపరంగా ముందడుగు
ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 400 కి.మీ. ప్రయాణించే సామర్థ్యం
న్యూఢిల్లీ, నవంబరు 15: ఎలక్ట్రిక్ విమానాలను కమర్షియల్ సేవల కోసం అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో చైనా కీలక ముందడుగు వేసింది. తమ సీఈ-25ఏ అనే 19సీట్ల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానాన్ని మొట్టమొదటిసారిగా ఇద్దరు పైలట్లు విజయవంతగా నడిపించారు. ఈ నెల 14న తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్సులో ఈ పరీక్ష నిర్వహించారు. విమానాన్ని మొత్తం 58నిమిషాల పాటు నడిపించారు. ఇందులో 16 నిమిషాల 38 సెకన్ల పాటు విమానం గాల్లోనే ఉంది. 60.4కిలోమీటర్లు ప్రయాణించింది. చైనా ప్రభుత్వ విమానయాన సంస్థ అయిన కోమాక్, బ్యాటరీల తయారీకి ప్రసిద్ధి చెందిన సీఏటీఎల్ సంస్థ, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ కలిసి సంయుక్తంగా ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేశాయి. ఈ విమానం గంటకు 300కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 2,400 మీటర్ల ఎత్తులో 400కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ విమానాన్ని పైలట్లు లేకుండా మొదటిసారిగా ఫిబ్రవరి 2న నడిపించి పరీక్షించారు.