Grok AI Tool: గ్రోక్ అసభ్య కంటెంట్‌పై కేంద్రం సీరియస్
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:43 AM
ఎక్స్’ సంస్థకు చెందిన కృత్రిమ మేధ టూల్ ‘గ్రోక్’ సృష్టిస్తున్న అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. 72 గంటల్లోగా ఆ కంటెంట్ ఉన్న పోస్టులను తొలగించాలని...
మహిళల చిత్రాలను అశ్లీలంగా మారుస్తున్న ‘ఎక్స్’ చాట్‌బాట్ గ్రోక్
72 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించాలని కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ, జనవరి 2: ‘ఎక్స్’ సంస్థకు చెందిన కృత్రిమ మేధ టూల్ ‘గ్రోక్’ సృష్టిస్తున్న అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. 72 గంటల్లోగా ఆ కంటెంట్ ఉన్న పోస్టులను తొలగించాలని ‘ఎక్స్’ను ఆదేశించింది. ఆ కంటెంట్ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా, డిజిటల్ భద్రతను ఉల్లంఘించేలా ఉందని పేర్కొంది. మహిళలు, చిన్నారుల చిత్రాలను అసభ్యంగా, అశ్లీలంగా మార్చేందుకు వీలు కల్పిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించేందుకు తావిస్తున్న ఈ సాంకేతికతలో వెంటనే తగిన మార్పులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలకా్ట్రనిక్స్, సమాచార, ప్రసార శాఖ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలేమిటనే వివరాలతో 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ‘ఎక్స్’ పాటిస్తున్న ప్రమాణాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించామని పేర్కొంది. తమ ఆదేశాలను పాటించకపోతే.. కేంద్ర ఐటీ చట్టం, సైబర్, క్రిమినల్, చిన్నారుల భద్రత చట్టాల కింద చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ‘ఎక్స్’ను హెచ్చరించింది. ‘గ్రోక్’ టూల్ ఆధారంగా ‘ఎక్స్’లో మహిళల చిత్రాలను అశ్లీలంగా, అసభ్యంగా మార్చి పోస్టు చేయడం ట్రెండింగ్‌గా మారడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. నకిలీ, తప్పుడు ఖాతాల నుంచి మహిళల చిత్రాలను ‘ఎక్స్’లో అప్‌లోడ్ చేసి.. ‘గ్రోక్’కు ప్రాంప్ట్ (సూచనలు) ఇవ్వడం ద్వారా వారు బికినీల్లో, అతి చిన్న వస్త్రాల్లో ఉన్నట్టుగా మార్చుతున్నారన్నారు. ఈ లేఖ నేపథ్యంలోనే ‘ఎక్స్’కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.