Share News

కెనడా స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:21 AM

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా రాష్ట్రంలో టంబ్లర్‌ రిడ్జ్‌ సెకండరీ స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఒక షూటర్‌ విచక్షణరహితంగా కాల్పులు జరిపింది.

కెనడా స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి

  • 25 మందికిపైగా గాయాలపాలు.. ఇద్దరి పరిస్థితి విషమం.. కాల్పులకు పాల్పడింది18 ఏళ్ల ట్రాన్స్‌జెండర్‌!

  • ఇంట్లో తల్లిని, తమ్ముణ్ని చంపేసి.. అక్కణ్నుంచి బడికి వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన షూటర్‌

  • తనను తాను కాల్చుకుని ఆత్మహత్య

టొరంటో, ఫిబ్రవరి 11: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా రాష్ట్రంలో టంబ్లర్‌ రిడ్జ్‌ సెకండరీ స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఒక షూటర్‌ విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రికి వెళ్లే దారిలో మరొకరు మరణించారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బడిలో కాల్పులు జరిపిన ఆ షూటర్‌ తనను తాను కాల్చుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కాల్పులు జరిపింది మహిళా షూటర్‌గా పోలీసులు తొలుత భావించినప్పటికీ.. ‘జెస్సీ స్ట్రాంగ్‌ (18)’ అనే ట్రాన్స్‌జెండర్‌గా దర్యాప్తులో గుర్తించారు. పుట్టుకతో అబ్బాయి అయినా.. జెస్సీ 2023 నుంచి తనను తాను అమ్మాయిగా భావించుకుంటున్నట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరిపే క్రమంలో... ఆ స్కూలుకు సమీపంలోని ఒక ఇంట్లో రెండు మృతదేహాలు కనిపించాయి. ఆ రెండు మృతదేహాలూ జెస్సీ తల్లి, తమ్ముడివిగా భావిస్తున్నారు. జెస్సీ తొలుత వారిద్దరితో గొడవపడి, వారిని చంపేసి నేరుగా పాఠశాలకు చేరుకుని అక్కడ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్బాయిగా పుట్టినా తనను తాను అమ్మాయిగా భావించుకోవడంతో స్కూల్లో తోటి పిల్లలు ఎగతాళి చేశారని, వేధింపులకు గురిచేశారని.. తనను అర్థం చేసుకోని సమాజంపై తనకు ద్వేషం కలిగిందని.. ఈ ఘోరానికి పాల్పడేముందు జెస్సీ లేఖ రాసినట్టు తెలుస్తోంది. కెనడాలోని నోవా స్కోషియాలో గాబ్రియేల్‌ వోర్ట్‌మన్‌ అనే దుండగుడు 2020లో.. పోలీసు దుస్తులు ధరించి, పోలీసు వాహనంలో రెండు రోజులపాటు తిరుగుతూ జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అతడు తన సొంత ఇంటితోపాటు పలు ఇళ్లకు నిప్పు పెట్టాడు. ఆ మంటల్లో కాలి మరో 9 మంది చనిపోయారు. దాని తర్వాత కెనడాలో కాల్పుల ఘటనలో ఇంతమంది చనిపోవడం ఇదే. కాగా, కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

థాయ్‌లాండ్‌లోనూ

థాయ్‌లాండ్‌లోని హత్‌ యాయ్‌ నగరంలో ఒక పాఠశాలలోకి అసాల్ట్‌రైఫిల్‌తో చొరబడిన ఒక టీనేజర్‌(18) జరిపిన కాల్పుల్లో.. బడి ప్రధానోపాధ్యాయుడు, డైరెక్టర్‌ సహా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో పాఠశాల డైరెక్టర్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఈ దురాగతానికి పాల్పడే ముందు ఇంటివద్ద అతడు తన తల్లితో కూడా గొడవపడ్డాడని..ఆమెకు హాని తలపెట్టే ప్రయత్నం చేశాడని.. అతణ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు లు రాగా,వారిలో ఒకరినుంచి ఎం4 రైఫిల్‌ లాక్కుని స్కూల్లోకి వచ్చాడని అధికారులు తెలిపారు.

Updated Date - Feb 12 , 2026 | 06:53 AM