Share News

ప్రతిభకు కెనడా ఆహ్వానం

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:43 AM

ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడా ఆహ్వానం పలుకుతోంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌, డాక్టోరల్‌ డిగ్రీలు చేసేందుకు నిబంధనలు సరళీకరించింది.

ప్రతిభకు కెనడా ఆహ్వానం

  • పీహెచ్‌డీ అభ్యర్థులకు 14 రోజుల్లోనే అలా్ట్ర ఫాస్ట్‌ వీసా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రతిభావంతులైన విద్యార్థులకు కెనడా ఆహ్వానం పలుకుతోంది. ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌, డాక్టోరల్‌ డిగ్రీలు చేసేందుకు నిబంధనలు సరళీకరించింది. జాతీయ విద్యా పరిమితి నుంచి అలాగే ప్రొవిన్షియల్‌ అటాస్టేషన్‌ లెటర్‌ (పీఏఎల్‌) నుంచి వారికి మినహాయింపు నిచ్చింది. పీహెచ్‌డీ దరఖాస్తుదారులు, వారి కుటుంబాల కోసం 14 రోజుల్లో ప్రాసెసింగ్‌ చేసే అలా్ట్ర ఫాస్ట్‌ వీసాలను తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ప్రపంచంలోని తెలివైన, ఉత్తమ విద్యార్థులను ఆకర్షించడానికి మార్క్‌ కార్నీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబరు 2025లోనే ఇమ్మిగ్రేషన్‌, శరణార్థి, పౌరసత్వ కెనడా (ఐఆర్‌సీసీ)లో ఈమేరకు మార్పులు జరిగాయి. ప్రభుత్వ గుర్తింపుపొందిన విద్యాసంస్థల్లో పరిమితులు కూడా పూర్తిగా మినహాయించినట్లు అధికారికంగా ఆ సంస్థ తెలిపింది. కొత్తగా 1.55 లక్షల మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అత్యధిక విలువైన గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యార్థులకు ప్రత్యేకంగా సుమారు 49 వేల అనుమతులు కేటాయించారు. కాగా తన ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను కెనడా సవరించింది. పరిశోధన, హెల్త్‌కేర్‌ వర్కర్లు, విమానయాన నిపుణులు, ఎంపిక చేసిన సైనిక నియామకాల కోసం తన ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీలో విధానంలో కొత్త ప్రాధాన్య వర్గాలను జోడించింది. కీలకమైన విభాగాల్లో కార్మికుల కొరతను తీర్చడమే లక్ష్యంగా ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ వ్యవస్థలో కొత్త ప్రాధాన్య విభాగాలను కెనడా ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టింది. ఆర్థిక రంగాన్ని వెంటనే బలోపేతం చేసేందుకు నైపుణ్య కార్మికులను దేశానికి రప్పించే లక్ష్యంతో కెనడా ఈ మార్పులు చేసినట్లు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది.

Updated Date - Feb 20 , 2026 | 02:43 AM