దుబాయిలో రాజకీయ బతుకమ్మ!
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:53 AM
దుబాయిలో బతుకమ్మ ఉత్సవాలకు రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాయి. ఆదివారం సాయంత్రం ఇక్కడ జరిగిన బతుకమ్మ సంబరాలు ఆకాశాన్నంటాయి.
అంబరాన్నంటిన బీఆర్‌ఎస్ సంబరాలు
సారు రావాలి.. కారు కావాలంటూ నినాదాలు
రాజకీయ సభగా మారిందని మహిళల అసహనం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): దుబాయిలో బతుకమ్మ ఉత్సవాలకు రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాయి. ఆదివారం సాయంత్రం ఇక్కడ జరిగిన బతుకమ్మ సంబరాలు ఆకాశాన్నంటాయి. పెద్ద సంఖ్యలో తెలంగాణ కుటుంబాలు పాల్గొన్న ఈ ఉత్సవాల సందర్భంగా స్టేడియం కిక్కిరిసిపోయింది. జనాలను చూసి అతిథులుగా పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సారు రావాలి.. కారు కావాలి.. అంటూ నినాదాలు చేశారు. పూల పండుగ కాస్తా రాజకీయ సభగా మారడంతో సభకు హాజరైన మహిళలు ఒకింత అసహనానికి గురయ్యారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన పీ.కిరణ్ రావు నేతృత్వం వహిస్తున్న ఈటీసీఏ అనే తెలంగాణ ప్రవాసీ సంఘం నిర్వహించిన ఈ ఉత్సవాలకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తారని నిర్వాహకులు ప్రకటించినా.. ఆయన హాజరు కాలేదు.
అయితే, నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఏ.జీవన్‌రెడ్డి, షకీల్, బిగాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జనాల హోరును చూస్తుంటే ఇది దుబాయి స్టేడియమా? లేక హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియమా? అనేది తెలియకుండా ఉందని వ్యాఖ్యానించారు. దుబాయిలోని జనాల స్పందనను చూస్తుంటే బీఆర్‌ఎ్‌సకు ఎదురు లేదనిపిస్తోందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎక్కువగా దుబాయిలో గడిపే మాజీ ఎమ్మెల్యే షకీల్..అరబ్బుల వస్త్రధారణ అయిన కద్దురాలో రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో దుబాయితో పాటు ఇతర ఎమిరేట్ల నుంచి తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన కాన్సులేట్ జనరల్ విష్ణువర్దన్‌రెడ్డి కారు దిగి గేటు దాటడానికి అర్ధగంట పట్టింది. మరోవైపు.. వచ్చే శని, ఆదివారాల్లో కాంగ్రెస్, బీజేపీ అనుకూల సంఘాలు బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి.