Share News

Iran Crisis: ఇరాన్‌లో ఊచకోత!

ABN , Publish Date - Jan 14 , 2026 | 06:11 AM

ఇరాన్‌లో ఊచకోత కొనసాగుతోంది. ఆందోళనలను అణచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దారుణ మారణహోమానికి దారితీశాయి. ఇప్పటికే వేలాది మంది నిరసనకారులు, భద్రతా బలగాల సిబ్బంది మృతిచెందారు.

Iran Crisis: ఇరాన్‌లో ఊచకోత!

  • నిరసనకారులపై కాల్పులకు ఖమేనీ ఆదేశాలు?

  • 2 వేల మందికిపైగా మరణించారన్న అధికారులు

  • 12వేల మందికిపైగా చనిపోయారన్న ‘ఇరాన్‌ ఇంటర్నేషనల్‌’

న్యూఢిల్లీ, జనవరి 13: ఇరాన్‌లో ఊచకోత కొనసాగుతోంది. ఆందోళనలను అణచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దారుణ మారణహోమానికి దారితీశాయి. ఇప్పటికే వేలాది మంది నిరసనకారులు, భద్రతా బలగాల సిబ్బంది మృతిచెందారు. ఘర్షణల్లో 2 వేల మందికిపైగా మరణించారని ఇరాన్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక సాయుధ, ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయని ఆరోపించాయి. మరోవైపు ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో భారీ స్థాయిలో హింస చోటుచేసుకున్నట్టు ఇరాన్‌ అధికారిక టీవీ అధికారికంగా అంగీకరించింది. నిరసనకారులను ఉగ్రవాద గ్రూపులుగా అభివర్ణిస్తూ, వారి మరణాల గురించి కాకుండా.. ఘర్షణల్లో చనిపోయిన భద్రతా బలగాలను కీర్తించింది. ‘‘దేశవ్యాప్తంగా జరిగి సాయుధ, ఉగ్రవాద గ్రూపుల నిరసనలను అణచివేసే క్రమంలో భారీ సంఖ్యలో చాలా మంది అమరులు అయ్యారు’’ అని ఇరాన్‌ అమరుల ఫౌండేషన్‌ నేత అహ్మద్‌ మౌసావి పేర్కొన్నట్టు వార్తను ప్రసారం చేసింది. ఇక గురువారం రాత్రి నుంచి ఆందోళనకారులపై ఇరాన్‌ భద్రతాదళం ఇస్లామిక్‌ రెవెల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌తోపాటు బసిజ్‌ మిలీషియా గ్రూపు కాల్పులకు దిగాయని.. 12 వేల మందికిపైగా మరణించారని, వేలాది మంది గాయపడ్డారని ‘ఇరాన్‌ ఇంటర్నేషనల్‌’ వార్త సంస్థ కథనం ప్రచురించింది.


ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ స్వయంగా కాల్పులకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించింది. నిజానికి ఇరాన్‌లో ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేయడం, విదేశాలకు ఫోన్‌కాల్స్‌ను నిషేధించడంతో గత ఐదారు రోజులుగా.. అక్కడేం జరుగుతోందో బయటి ప్రపంచానికి ఎలాంటి సమాచారం అందలేదు. మంగళవారమే విదేశాలకు ఫోన్‌కాల్స్‌ను పునరుద్ధరించారు. దీనితో ఇరాన్‌లోని అధ్యక్ష కార్యాలయ వర్గాలు, స్థానిక నేతలు, అధికారులు, ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ‘12 వేల మంది ఇరానీయులను చంపి నిశ్శబ్ధంగా ఉండలేరు’ అంటూ కథనం ప్రచురించింది. ‘‘ఇరాన్‌లో విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ నిలిపివేయడం, వార్తా సంస్థలపై నియంత్రణలు పెట్టడం వంటి చర్యలు కేవలం భద్రత కోసం కాదు. నిజాలను తొక్కిపెట్టడం కోసమే. ఇరాన్‌లోని 31 రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో స్థానికుల నుంచి అధ్యక్ష కార్యాలయం వర్గాలదాకా సమాచారం సేకరించి, క్షుణ్నంగా విశ్లేషించాం. గురు, శుక్రవారాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అణచివేత, హింస చోటు చేసుకున్నాయి. భద్రతాదళాలు కావాలనే ప్రణాళికతో కాల్పులు జరిపాయి. 12 వేల మందికిపైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. మృతుల్లో చాలా వరకు 30 ఏళ్లు, ఆలోపు వయసున్న యువతే. దారుణ మారణకాండను ఎక్కువకాలం కప్పిపుచ్చలేరు. వాస్తవాలు బయటికి వస్తాయి..’’ అని పేర్కొంది. ఇక మృతుల సంఖ్యపై ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, ఇరాన్‌ ప్రభుత్వం తుది ఘడియల్లో ఉందని, ఆ ప్రభుత్వానికి ఇక రోజులు, వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని జర్మనీ చాన్స్‌లర్‌ మెర్జ్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ అధికారులు తక్షణమే ఆందోళనకారులపై హింసకు ముగింపు పలకాలన్నారు. ‘ఏదైనా ప్రభుత్వం బలప్రయోగం ద్వారా అధికారాన్ని కాపాడుకుంటుంటే.. ఆ ప్రభుత్వం ముగింపు దశకు చేరినట్టే. ఇప్పుడు మనం ఇరాన్‌ ప్రభుత్వ చివరి రోజులను చూస్తున్నాం’ అన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 06:33 AM