ఎప్‌స్టీన్‌తో సంబంధాలకు పశ్చాత్తాప పడుతున్నా
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:43 AM
టీనేజీ బాలికలను ఎరవేసి సెక్స్ స్కాంలు జరిపే సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉన్నందుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు...
క్షమాపణలు చెబుతున్నా
వైద్య సేవలకు నిధుల కోసమే ఆయనతో సంభాషణలు.. బిల్ గేట్స్ వ్యాఖ్యలు
వాషింగ్టన్, ఫిబ్రవరి 5: టీనేజీ బాలికలను ఎరవేసి సెక్స్ స్కాంలు జరిపే సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉన్నందుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఎప్‌స్టీన్ పత్రాల్లో ఆయన ప్రస్తావన ఉండడం చర్చనీయాంశంగా మారింది. బిల్ గేట్స్ నేరం చేసినట్టు ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ సమాజంలోని ప్రముఖ వ్యక్తులు బాధ్యతాయుతంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆస్ట్రేలియాకు చెందిన టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం చాలా పెద్ద తప్పిదమని అంగీకరించారు. ‘‘ఆయనతో గడిపిన ప్రతి నిమిషానికీ పశ్చాత్తాప పడుతున్నాను. క్షమాపణలు చెబుతున్నాను. ప్రపంచంలో ఆరోగ్య సేవలు అందించడానికి సంబంధించిన దానధర్మాలపైనే మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయనకు చాలా మంది పెద్ద పెద్ద ధనవంతులు తెలుసు. ప్రపంచంలో ఆరోగ్య సేవలు అందించడం కోసం నిధులు తీసుకొస్తానని చెప్పేవారు. మా మాటలన్నీ దానిపైనే ఉండేవి. చివరకు శూన్యం మిగిలింది. నేను ఎలాంటి అనుచిత సంబంధాలు పెట్టుకోలేదు’’ బిల్‌గేట్స్ స్పష్టం చేశారు.