తప్పు చేశా.. మన్నించండి!
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:06 AM
ఎప్‌స్టిన్ ఫైళ్ల వ్యవహారంలో చిక్కుకుని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి వైదొలగిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..
ఎప్‌స్టిన్ వ్యవహారంలో గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణ
ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు ఎఫైర్లు ఉన్నట్లు అంగీకారం
న్యూయార్క్, ఫిబ్రవరి 25: ఎప్‌స్టిన్ ఫైళ్ల వ్యవహారంలో చిక్కుకుని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నుంచి వైదొలగిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. తాను తప్పుచేశానని తాజాగా అంగీకరించారు. లైంగిక నేరగాడైన జోసెఫ్ ఎప్‌స్టిన్‌తో తనకు అనుబంధం ఉందని తెలిపారు. ఇందుకుగాను గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ మంగళవారం ప్రచురించింది. ‘మంగళవారం టౌన్‌హాల్ మీటింగ్ సందర్భంగా ఎప్‌స్టిన్‌తో లింకులపై అడిగిన ప్రశ్నలకు గేట్స్ జవాబులిచ్చారు. ఇద్దరు రష్యన్ మహిళలతో ఎఫైర్లు ఉన్నాయని అంగీకరించారు. అయితే వారిద్దరితో సంబంధ బాంధవ్యాలకు, ఎప్‌స్టిన్ బాధితులకు సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు’ అని గేట్స్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఎప్‌స్టిన్ చట్టవిరుద్ధ ప్రవర్తనతో తనకు సంబంధం లేదని గేట్స్ తెలిపారు. ‘నేనెలాంటి అక్రమాలూ చేయలేదు.. చూడలేదు. ఎప్‌స్టిన్ చుట్టూ ఉన్న బాధిత మహిళలతో సమయం గడపలేదు. ఇద్దరు రష్యన్ మహిళలతో మాత్రం ఎఫైర్లు ఉండేవి. వారిలో ఒకరు బ్రిడ్స్ ప్లేయర్. బ్రిడ్స్ పోటీల సందర్భంగా ఆమె నన్ను కలిసింది. రెండో మహిళ రష్యా నూక్లియర్ ఫిజిసిస్ట్. వ్యాపార కార్యకలాపాల సందర్భంగా ఆమెను కలిశాను. ఈ రెండు ఎఫైర్ల గురించి ఎప్‌స్టిన్‌కు తర్వాత తెలిసింది. అయితే ఇవి అతడి నేరపూరిత కార్యకలాపాలకు సంబంధించినవి కావు’ అని గేట్స్ తేల్చిచెప్పారు. ఓ మైనర్‌తో లైంగిక కార్యకలాపాలు నడిపానని 2008లో ఎప్‌స్టిన్ నేరాంగీకారం ఇచ్చాడు. ఆ తర్వాత మూడేళ్లకు 2011లో అతడితో తొలిసారి భేటీ అయ్యానని గేట్స్ వెల్లడించారు. అయితే అతడి నేపథ్యాన్ని సరిగా తెలుసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎప్‌స్టిన్ వ్యవహారంలో తన (మాజీ) భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ఎప్పుడూ అనుమానిస్తుండేవారని.. 2013లో ఆమె ఆందోళన వ్యక్తం చేశాక కూడా అతడితో భేటీలు కొనసాగించానన్నారు. 2014లో ప్రైవేటు జెట్‌లో ఎప్‌స్టిన్‌తో కలిసి ప్రయాణించానని.. ఎప్‌స్టిన్‌ను కలవడం అదే చివరిసారని గేట్స్ చెప్పారు.