మానవ మెదళ్లపై ఔషధ ప్రయోగాలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:57 AM
కొత్త ఔషధాలను తయారుచేసే క్రమంలో తొలుత వాటిని ల్యాబ్‌లో ఎలుకలపైన, గినియాపిగ్స్ వంటివాటిపైనా ప్రయోగించడం కద్దు. వాటివల్ల భారీగా దుష్ప్రభాలేవీ ఉండవని ...
న్యూయార్క్, జూన్ 21: కొత్త ఔషధాలను తయారుచేసే క్రమంలో తొలుత వాటిని ల్యాబ్‌లో ఎలుకలపైన, గినియాపిగ్స్ వంటివాటిపైనా ప్రయోగించడం కద్దు. వాటివల్ల భారీగా దుష్ప్రభాలేవీ ఉండవని ధ్రువీకరించుకున్న తర్వాత మానవులపై ప్రయోగిస్తారు. అలా జంతువులపై కాకుండా.. చనిపోయినవారి మెదళ్లను సేకరించి, వాటిని అత్యంత అధునాతన యంత్రాలకు అనుసంధానం చేసి, కొన్ని రకాల ప్రత్యేక స్రావాలను వాటిలోకి పంపడం ద్వారా అవి పాక్షికంగా సజీవంగా ఉండేలా చేసి.. ఆ మెదళ్లపై తాము అభివృద్ధి చేసిన మందులను ప్రయోగించి చూస్తోందో సంస్థ. దాని పేరు బెక్సార్గ్. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇది. నరాల బలహీనత వ్యాధులైన అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటివాటిని నయం చేసే మందులను ఈ సాంకేతికత సాయంతో అత్యంత కచ్చితంగా పరీక్షించవచ్చని బెక్సార్గ్ సైంటిస్టులు చెబుతున్నారు. జంతువులపైన, ల్యాబ్‌లో పెంచిన ఎలుకల వంటి చిన్న జీవుల మెదడు కణాలపై కంటే.. నిజంగా మనుషుల మెదడుపై మందులు ఎలా పనిచేస్తున్నాయో దీని ద్వారా వేగంగా తెలుసుకోవచ్చని వారు వివరిస్తున్నారు. అవయవదానం చేసినవారిలో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధులతో చనిపోయినవారి మెదళ్లను సేకరించి.. వాటిపై వారు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా గడిచిన ఐదేళ్ల కాలంలో వారు 700కు పైగా మానవ మెదళ్లపై ఔషధ పరీక్షలు చేశారు. సేకరించిన మెదళ్లను పాక్షికంగా సజీవంగా ఉంచడానికి బెక్సార్గ్ శాస్త్రజ్ఞులు ‘బ్రెయిన్‌ఎక్స్’ అనే యంత్రాన్ని వాడుతారు. ఆ యంత్రం.. ప్రయోగాల కోసం తెచ్చిన మెదళ్లకు సింథటిక్ రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. ఆ రక్తంలో ఉండే ఆక్సిజన్, పలు పోషకాలు మెదడు కణాలు చనిపోకుండా చూస్తాయి.