బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:39 AM
బ్రిటన్ ప్రఖ్యాత జాతీయ ప్రసార సంస్థ బీబీసీ వచ్చే రెండేళ్లలో దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బుధవారం వెల్లడించింది.
2వేల మంది ఇంటికే !..ట్రంప్ దావా నేపథ్యంలో సంక్షోభం
లండన్, ఏప్రిల్ 16: బ్రిటన్ ప్రఖ్యాత జాతీయ ప్రసార సంస్థ బీబీసీ వచ్చే రెండేళ్లలో దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బుధవారం వెల్లడించింది. తన వార్షిక బడ్జెట్‌లో సుమారు 500మిలియన్ పౌండ్లను(సుమారు రూ. 6వేల కోట్లు) ఆదా చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంలో బీబీసీ చేపట్టిన అతిపెద్ద లేఆఫ్స్ ఇవే కావడం గమనార్హం. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తాత్కాలిక డైరెక్టర్ ఈమెయిల్ ద్వారా సిబ్బందికి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు చట్టపరమైన చిక్కులు బీబీసీని మరింత సంక్షోభంలోకి నెట్టాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీ ఎడిటింగ్ వివాదాస్పదం కావడంతో సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, వార్తా విభాగం అధిపతి డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బీబీసీపై ట్రంప్ ఏకంగా 10 బిలియన్ డాలర్ల(సుమారు 93, 359 కోట్లు) పరువునష్టం దావా వేశారు. ఈ సంక్షోభ సమయంలో వచ్చే నెలలో గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మ్యాట్ బ్రిట్టన్ బీబీసీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.