బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య.. బాధిత కుటుంబానికి భారీ పరిహారం
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:18 PM
బంగ్లాదేశ్‌లో గతేడాది ఓ హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అతడి కుటుంబానికి ప్రభుత్వం తాజాగా పరిహారాన్ని ప్రకటించింది. వారికి ఇల్లు కూడా కట్టిస్తామని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన మూకదాడిలో హత్యకు గురైన హిందూ వ్యక్తి దీపూ చంద్రదాస్ కుటుంబానికి అక్కడి ప్రభుత్వం ఆర్థికసాయాన్ని ప్రకటించింది. తన కుటుంబానికి దీపూ ఒక్కరే జీవనాధారం కావడంతో అతడి కుటుంబానికి 47 లక్షల టాకాల (బంగ్లాదేశీ కరెన్సీ) ఆర్థికసాయాన్ని అందిస్తామని ప్రకటించింది.
తరాక్‌నందా యూఎన్ఓ అధికారి ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. వారికి ఇంటి నిర్మాణం కోసం 25 లక్షల టాకాలను (బంగ్లాదేశీ కరెన్సీ) మంజూరు చేసినట్టు పేర్కొంది. నేషనల్ హౌసింగ్ అథారిటీ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం జరుగుతుందని తెలిపింది. దీపూ తండ్రి, భార్యకు ఒక్కొక్కరికీ 10 లక్షల టాకాల నగదును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లల్లో జమ చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. దీపూ బిడ్డల పేరిట మరో ఐదు లక్షల టాకాలను ఎఫ్‌డీ వేస్తామని కూడా పేర్కొంది.
గతేడాది బంగ్లాదేశ్ విద్యాశాఖ సలహాదారు సీఆర్ అబ్రార్ దీపూ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున సంతాపం తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీపూ హత్య యావత్ దేశానికీ తలవంపులని ఆయన విచారం వ్యక్తం చేశారు.
‘ఒక దేశంగా, సభ్య సమాజంగా అన్ని మతాలు, జాతులు, వారి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తాము. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఎలాంటి భేదాభిప్రాయాలు, అభ్యంతరాలు ఉన్నా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోజాలరు’ అని అన్నారు. దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు దీపూ దాస్‌ను ఇష్టారీతిన కొట్టి చెట్టునుంచి వేలాడదీశారు. చివరకు సజీవదహనం చేశారు. అయితే, దీపూ ఎలాంటి దైవదూషణా చేయలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.