ఎడారి దేశాల్లో ‘శరణు ఘోష’
ABN , Publish Date - Nov 30 , 2026 | 03:57 AM
కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి. అత్యంత నిష్ఠతో, భక్తి ప్రపత్తులతో అయ్యప్ప మాల వేసుకొని.. ఆ మణికంఠుని పూజలో నిమగ్నమైపోతారు భక్తులు. భక్తిశ్రద్ధలతో మండల దీక్ష ముగించి..
అయ్యప్ప భక్తుల దీక్షలతో ఆధ్యాత్మిక వాతావరణం
గల్ఫ్ దేశాల నుంచి ఇరుముడితో శబరిమలకు స్వాములు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి. అత్యంత నిష్ఠతో, భక్తి ప్రపత్తులతో అయ్యప్ప మాల వేసుకొని.. ఆ మణికంఠుని పూజలో నిమగ్నమైపోతారు భక్తులు. భక్తిశ్రద్ధలతో మండల దీక్ష ముగించి, శబరిమలలోని సన్నిధానానికి చేరుకొని, ఇరుముడితో 18 మెట్లు ఎక్కి.. అయ్యప్పను దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్లే అంటారు స్వాములు. అందుకు అరబ్, అమెరికా, ఆంధ్రా.. ఇలా ఏదీ అడ్డంకి కాదంటున్నారు ప్రవాసీ అయ్యప్పలు. గల్ఫ్ దేశాల్లో కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న భక్తుల శరణు ఘోషతో ఆధ్యాత్మిక వాతవారణం నెలకొంది. భక్తులు తమ మండల దీక్ష అనంతరం బృందాల వారీగా శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి కేరళలోని కొ చ్చి విమానాశ్రయానికి వెళ్లే భక్తులు అక్కడ ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తారు. వారిలో దుబాయి, యూఏఈ నుం చి వెళ్లే స్వాముల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, ఆధ్యాత్మిక ఆనందాన్ని వర్ణించలేమని అబుధాబిలోని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రాజశ్రీనివాసరావు (వరంగల్) చెబుతున్నారు.
ఆయన ఏటా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. అబుధాబి నుంచి క్రమం తప్పకుండా శబరిమలకు ఇరుముడి కట్టుకొని వెళ్లడం తనకు మధురానుభూతి అని చెప్పారు. ఇక సౌదీ అరేబియాలో కొన్ని తెలుగు కుటుంబాలు భక్తితో పడిపూజను నిర్వహిస్తున్నట్లుగా సౌదీలోని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రంజిత్ చిట్టలూరి (చిత్తూరు జిల్లా) చెప్పారు. బహ్రెయిన్‌లోని అయ్యప్ప సమాజం మండల దీక్ష కాలంలో స్వామి ధ్యానంలో నిమగ్నమై ఉంటుందని అయ్యప్ప సేవా మండలికి చెందిన సాంబశివరావు జటవాత్ (కృష్ణా జిల్లా) అన్నారు. త్వరలో 18 మంది భక్తులు శబరిమల వెళ్తున్నట్లు సాంబశివరావు చెప్పారు. ఒమాన్ నుంచి ఇప్పటికి వంతుల వారీగా అనేక మంది భక్తులు వెళ్లి వచ్చారని వివరించారు. ఖతార్, కువైత్ దేశాల్లో కూడా కొంత మంది భక్తులు అయ్యప్ప దీక్షను పాటిస్తున్నప్పటికీ ఉద్యోగరీత్యా, ఇతరత్రా కారణాలతో నల్ల దుస్తులను ధరించడం లేదని తెలుస్తోంది.