చందమామను చుట్టొస్తాం!
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:38 AM
చంద్రుడిపై పరిశోధనలకు మానవసహిత యాత్రలను దాదాపు 54 ఏళ్ల క్రితమే నిలిపివేసిన అమెరికా మళ్లీ ఇప్పుడు ఆ దిశగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్ ....
1972 తర్వాత.. చంద్రుడిపై అధ్యయనానికిమానవ సహిత యాత్ర చేపట్టిన అమెరికా
ఓరియన్ అంతరిక్ష నౌకలోజాబిలిని చుట్టిరానున్న నలుగురు వ్యోమగాములు
10 రోజుల మిషన్
చంద్రుడిపై పరిశోధనలకు మానవసహిత యాత్రలను దాదాపు 54 ఏళ్ల క్రితమే నిలిపివేసిన అమెరికా మళ్లీ ఇప్పుడు ఆ దిశగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్ ఆర్టెమిస్-2. నాసా శాస్త్రజ్ఞులు రూపొందించిన షెడ్యూలు ప్రకారం.. అంతా సక్రమంగా జరిగితే ఈ పాటికే నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ స్పేస్‌క్రా్‌ఫ్టను మోసుకుంటూ 322 అడుగుల ఎత్తైన భారీ రాకెట్ ఎస్‌ఎల్‌ఎస్ నింగిలోకి భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.54 గంటలకు దూసుకుపోయి ఉంటుంది! ఈ మిషన్ ద్వారా అమెరికా సాధించాలనుకుంటున్న లక్ష్యాలేంటి? ఇందులో పాల్గొంటున్న వ్యోమగాములు ఎవరు? ఈ మిషన్ ప్రత్యేకతలేమిటి? అంటే..
10 రోజుల మిషన్
ఆర్టెమిస్-2 మిషన్ మొత్తం కాలపరిమితి 10 రోజులు. రాకెట్ నుంచి విడివడిన ఓరియన్ వ్యోమనౌక.. మొదటి 24 గంటల్లో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దాంట్లోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షిస్తారు. అనంతరం నాలుగురోజులపాటు ఆ వ్యోమనౌక చంద్రుడి దిశగా ప్రయాణిస్తుంది. దాదాపు 3,84,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుణ్ని చేరుకుని.. చందమామను దాటి అవతలివైపు (డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్.. ‘చంద్రుడి వీపు’ అనాలేమో!) 7600 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. మళ్లీ అక్కణ్నుంచీ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని (గ్రావిటీ అసిస్ట్).. ఇంజన్లను మండించి వేగాన్ని విపరీతంగా పెంచుకుని, భూమి దిశగా పయనిస్తుంది. 4-5 రోజులపాటు ప్రయాణించి భూమికి చేరుకుంటుంది.
ఇవాళ కాకపోతే.. రేపు, ఎల్లుండి...
ఒకవేళ వాతావరణ మార్పుల కారణంగాగానీ.. ఇతరత్రా సాంకేతిక సమస్యలవల్లగానీ.. గురువారం ఈ మిషన్ చేపట్టలేకపోతే? బ్యాకప్ ప్లాన్ కింద.. 2, 3, 4, 5, 6, ఏప్రిల్ 30 తేదీల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు లాంచ్ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లనూ శాస్త్రజ్ఞులు చేశారు.
మిషన్ లక్ష్యాలేమిటి?
భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్రలు సురక్షితంగా జరిగేలా చూసేందుకు నాసా ఆర్టెమిస్ ప్రాజెక్టు కింద పలు మిషన్లను చేపడుతోంది. ఈ క్రమంలోనే.. 2022లో చేపట్టిన ఆర్టెమిస్-1 మిషన్‌లో కేవలం ఖాళీ వ్యోమనౌకను పంపారు. అప్పుడు తెలుసుకున్న వివరాలు, సమాచారం ఆధారంగా.. ఈ రెండో మిషన్‌లో నలుగురు వ్యోమగాములను పంపుతున్నారు. అంత చిన్న వ్యోమనౌకలో, రోదసిలో పదిరోజులపాటు నలుగురు వ్యోమగాములు శ్వాస తీసుకోవడానికి సరిపడా ఆక్సిజన్ అందించే వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? ఈ మిషన్‌లో పరీక్షిస్తారు. రోదసిలో పరిభ్రమిస్తున్న వ్యోమనౌకలు ఒక్కోసారి 120డిగ్రీల వేడికి, ఒక్కోసారి మైనస్ 150డిగ్రీల చల్లదనానికి గురవుతుంటాయి. అంతటి విపరీతమైన వాతావరణ మార్పులను తట్టుకుని దాంట్లోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? (థర్మల్ మేనేజ్‌మెంట్).. వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉంటోందా?.. అనే అంశాలను పరిశీలిస్తారు. అంతా బాగుంటే.. ఈ సమాచారం ఆధారంగా ఆర్టెమిస్-3 మిషన్ చేపడతారు. ఆ తర్వాత(2028లో) చేపట్టబోయే ఆర్టెమిస్-4 మిషన్‌లో భాగంగా మానవులను చంద్రుడిపైకి పంపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అనంతర కాలంలో ఇతర గ్రహాలకు చేపట్టబోయే యాత్రలకు కూడా ఈ మిషన్ల తాలూకూ సమాచారమే కీలకం.
మునుపెన్నడూ వెళ్లనంత దూరం
ఈ యాత్రలో భాగంగా నాసా వ్యోమగాములు చంద్రుడి ఆవలివైపునకు.. భూమి నుంచి సుమారు 4,02,336 కిలోమీటర్ల దూరం వెళ్తారు. రోదసిలో మానవులు మునుపెన్నడూ వెళ్లనంత దూరం ఇది. గత రికార్డు 4,00,171 కిలోమీటర్లు. ఇందులోని వ్యోమగాములు.. భూమికి అత్యంత దూరంగా వెళ్లిన మానవులుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు.
వ్యోమగాముల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత
చంద్రుడి సమీపానికి వెళ్లే మొట్టమొదటి నల్ల జాతి వ్యక్తి విక్టర్ గ్లోవర్
చంద్రుడి సమీపానికి వెళ్లే తొలి మహిళ.. మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్
చంద్రుడి సమీపానికి వెళ్లే తొలి అమెరికాయేతర వ్యక్తి.. మరో మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్ (కెనెడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి).
చంద్రుడి సమీపానికి వెళ్లే అత్యధిక వయసున్న వ్యక్తి.. నాసా కమాండ్ రీడ్ వైజ్‌మన్ (50).
అత్యధిక వేగంతో భూమికి!
తిరుగు ప్రయాణంలో ఓరియన్ వ్యోమనౌక గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అంటే ధ్వనివేగానికి దాదాపు 32 రెట్లు. మనం కనురెప్ప వేసే సమయంలో ఈ వ్యోమనౌక 11 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ‘80 రోజుల్లో భూప్రదక్షిణ’ అని అప్పుడెప్పుడో 1872లో.. ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో జూల్స్‌వెర్న్ ఒక నవల రాశారు గానీ.. ఈ వేగంతో ప్రయాణిస్తే భూమిని చుట్టడానికి ఇప్పుడు పట్టే సమయం దాదాపు ఒక గంట మాత్రమే!!
- సెంట్రల్ డెస్క్