Share News

చంద్రుడి చెంత నుంచి సూర్యగ్రహణం

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:48 AM

జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ఇంద్రజ పాత్రలో శ్రీదేవి ‘మానస సరోవరం’ గురించి తన్మయత్వంతో చేసేవర్ణన ఇది! ఆ సినిమాలో ఇంద్రలోకం నుంచి వచ్చిన శ్రీదేవి భూమి అందాలు చూసి ఎంతగా మైమరచిందో..

చంద్రుడి చెంత నుంచి సూర్యగ్రహణం

  • వీక్షించిన ఆర్టెమిస్‌-2 వ్యోమగాములు

  • జాబిల్లిని అంత దగ్గర్నుంచి చూసి

  • భావోద్వేగం కలిగిందన్న వ్యోమగాములు

  • ‘‘హిమ శిఖరములట.. సుమ వనములట.. సరస్సులట.. సరోజములట.. జలపాతములట.. జలకములట..’’

..‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ఇంద్రజ పాత్రలో శ్రీదేవి ‘మానస సరోవరం’ గురించి తన్మయత్వంతో చేసేవర్ణన ఇది! ఆ సినిమాలో ఇంద్రలోకం నుంచి వచ్చిన శ్రీదేవి భూమి అందాలు చూసి ఎంతగా మైమరచిందో.. ఓరియన్‌ వ్యోమనౌకలో భూమి నుంచి చంద్రుడి చెంతకు వెళ్లిన నలుగురు వ్యోమగాములు జాబిలి ఆవలివైపు దృశ్యాలను చూసి అలాగే మైమరచిపోయారు! స్టన్నింగ్‌.. అద్భుతం.. మహాద్భుతం అంటూ మాటలకందని అనుభూతిని అక్షరాల్లో పొందుపరిచే ప్రయత్నం చేశారు. చందమామ ఉపరితలం మీదుగా నీలిగోళంలా కనిపించే భూమిని.. సూర్యగ్రహణాన్ని.. చంద్రుడిపై దాదాపు 950 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ ఉల్కాపాతబిలం (ఓరియంటేల్‌ ఇంపాక్ట్‌ బేసిన్‌) వంటివాటిని వేయి కళ్లు చేసుకుని చూశారు. నలుగురు వ్యోమగాములూ ఇద్దరిద్దరుగా విడిపోయి.. ఓరియన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ కిటికీల వద్ద చేరి..నరమానవులెవరూ చూడని దృశ్యాలను కన్నులారా తిలకించి పులకించిపోయారు. ఆ దృశ్యాలన్నింటినీ కెమెరా కళ్లతో చిత్రీకరించారు. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడి చెంతకు వెళ్లిన తొలి మహిళ క్రిస్టినా కోచ్‌.. ‘‘చంద్రుడిని అంత దగ్గర్నుంచీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా గాఢమైన భావోద్వేగం కలిగింది.’’ అని పేర్కొన్నారు. దీపపు సెమ్మెలోని రంధ్రాల నుంచి వచ్చే కాంతిలా.. చందమామపై కనిపించిన ప్రకాశవంతమైన బిలాలను చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. కాగా.. సోమవారం అర్ధరాత్రి దాటాక చంద్రుడి ఆవలివైపునకు చేరుకున్న ఈ వ్యోమనౌక మళ్లీ భూమి దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 40 వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించి.. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.07 గంటలకు.. శాన్‌డియోగో తీరానికి సమీపాన సముద్రంలో దిగనుంది.

Updated Date - Apr 08 , 2026 | 03:48 AM