ఆంత్రోపిక్ ఏఐ సేఫ్టీ చీఫ్ మృణాంక్ రాజీనామా
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:55 AM
ప్రముఖ కృత్రిమ మేధ స్టార్టప్ ‘ఆంత్రోపిక్’లో ఏఐ సేఫ్టీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రవాసభారతీయుడు మృణాంక్ శర్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు! ఈ సందర్భంగా ఆయన..
ప్రపంచం ప్రమాదంలో ఉందంటూ ‘ఎక్స్’లో పోస్ట్
వివేకం లేని సామర్థ్యం ప్రమాదకరమేనని స్పష్టీకరణ
న్యూయార్క్, ఫిబ్రవరి 10: ప్రముఖ కృత్రిమ మేధ స్టార్టప్ ‘ఆంత్రోపిక్’లో ఏఐ సేఫ్టీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రవాసభారతీయుడు మృణాంక్ శర్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు! ఈ సందర్భంగా ఆయన.. రిల్కే, విలియం స్టాఫోర్డ్ వంటి ప్రముఖ కవుల కవితలను ఉటంకిస్తూ.. ‘‘ప్రపంచం ప్రమాదంలో ఉంది’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఆయన నిగూఢంగా పెట్టిన పోస్టు సిలికాన్‌వ్యాలీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘నేను ఆంత్రోపిక్ నుంచి తప్పుకొంటున్నాను. గత మూడేళ్లుగా ఈ బృందంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. నాటి నుంచి ఇప్పటివరకూ ఏఐ రంగంలో జరిగిన మార్పులు నమ్మశక్యం కానివి. మనం నిర్మిస్తున్న ఏఐ మోడళ్ల సామర్థ్యం రోజురోజుకూ అద్భుతంగా పెరుగుతోంది. కానీ, మన సమాజానికి ఉండాల్సిన వివేకం మాత్రం అదే స్థాయిలో పెరగట్లేదు. వివేకం లేని సామర్థ్యం ఎప్పుడూ ప్రమాదకరమే. కేవలం ఏఐ వల్లనో, జీవాయుధాల వల్లనో మాత్రమే కాకుండా ప్రస్తుతం ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్న అనేక సంక్షోభాల వల్ల ప్రపంచం ప్రమాదంలో ఉంది’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సంస్థలో తమపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వస్తోందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.