Bangladesh violence: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మూకదాడి
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:09 AM
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు..
పలుమార్లు పొడిచి, పెట్రోల్ పోసి నిప్పు
చెరువులో దూకి ప్రాణాలతో బయటపడిన బాధితుడు
ఢాకా, జనవరి 1: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ హిందువును పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. షరియత్‌పూర్ పట్టణంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. షరియత్‌పూర్‌లో ఓ ఫార్మసీ నిర్వాహకుడైన ఖోకన్‌దాస్ (50) తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్తుతుండగా రాత్రి 9 గంటలప్పుడు దాస్‌పై దుండగులు దాడి చేశారు. పలుమార్లు పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా సమీపంలోని చెరువులోకి దూకాడు. రక్షించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న దాస్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ దాడికి పాల్పడిన వారి వివరాలు, కారణం తెలియాల్సి ఉంది. కాగా, బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతుండగా.. గత 2 వారాల్లో దేశంలోని హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య అనంతరం హింస చెలరేగింది. ఈ క్రమంలో హిందూ వ్యక్తులు దీపూచంద్రదాస్, అమృత్ మండల్ వేర్వేరు ఘటనల్లో హత్యకు గురికాగా.. మరో ఘటనలో బజేంద్రబిశ్వా్‌స ను అతని సహోద్యోగి తుపాకీతో కాల్చి చంపాడు.