కెనడా కవయిత్రి అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:50 AM
కెనడా కవయిత్రి అన్నే కార్సన్‌ను ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య నోబెల్ వరించింది. చారిత్రక కథన సంప్రదాయాలను మిళితం చేయడం ద్వారా సమకాలీన సాహిత్యంలో కొత్త పంథాను..
చారిత్రక కథనాలకు సమకాలీన వ్యాఖ్యానం
‘ఇఫ్ నాట్, వింటర్’ కవిత్వంతో ప్రసిద్ధం
సాహిత్యంలో కొత్త పంథాను సృష్టించారు
కొనియాడిన స్వీడిష్ అకాడమీ
స్టాక్‌హోమ్, అక్టోబరు 8: కెనడా కవయిత్రి అన్నే కార్సన్‌ను ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య నోబెల్ వరించింది. చారిత్రక కథన సంప్రదాయాలను మిళితం చేయడం ద్వారా సమకాలీన సాహిత్యంలో కొత్త పంథాను సృష్టించారంటూ కార్సన్ కృషిని స్వీడిష్ అకాడమీ కొనియాడింది. గ్రీక్, రోమన్ సాహిత్య గాథలు, ఇతివృత్తాల ఆధారంగా ఆమె కవిత్వం, వ్యాసాలు రాశారు. ఇరోస్ ద బిట్టర్ స్వీట్, ఆటోగ్రఫీ ఆఫ్ రెడ్, మెన్ ఇన్ ద ఆఫ్ అవర్స్.. వంటి రచనలు ఈ నేపథ్యం నుంచి వెలువడి, ప్రపంచవ్యాప్తంగా కార్సన్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘‘ప్రాచీన గాథలనే సృజించినా, ఆమె తన సొంత ముద్రను వదులుకోలేదు. ఆమె రచనలే అన్నట్టు అవి చదివిస్తాయి’’ అని అకాడమీ శాశ్వత కార్యదర్శి ఇన్‌గ్రిడ్ కార్ల్‌బెర్గ్ కొనియాడారు. కెనడాలోని టొరంటోలో 1950లో జన్మించిన కార్సన్, అధ్యాపకులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉత్తర అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీ న సాహిత్యం బోధించారు. పదవీ విరమణ అనంతరం భర్తతో కలిసి ఐస్‌లాండ్‌లో స్థిరపడ్డారు. నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. అవార్డు ప్రకటన సమయానికి ఆమె ‘గాలి సవ్వడిని వింటున్నారు’ అంటూ ప్రసిద్ధ కవిత్వ సంపుటి ‘ఇఫ్ నాట్, వింటర్’ లోని వాక్యాన్ని అవార్డు కమిటీ ప్రస్తావించింది. ఆ గ్రంథం ఆమెకు గొప్ప పేరును సంపాదించి పెట్టింది. వ్యాకరణ పండితులకు పదాలపై ఉండే మోజు, కవయిత్రికి కొత్త అర్థాలపై ఉండే ఇష్టం.. రెండింటి కలయికే కార్సన్ సాహిత్య సారం అని సాహిత్య కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సోన్ వ్యాఖ్యానించారు.