ఏఐ వల్ల త్వరలో 3.5 కోట్ల ఉద్యోగాలు ఊస్ట్
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:32 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల అమెరికాలో సేవల రంగంలో భారీగా ఉద్యోగాలకు కోతపడే అవకాశం ఉందని ఆ దేశ వ్యాపారవేత్త, డెమోక్రటిక్ పార్టీ మాజీ అధ్యక్ష...
అమెరికా వ్యాపారవేత్త ఆండ్రూ యాంగ్ అంచనా
న్యూయార్క్, ఫిబ్రవరి 19: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల అమెరికాలో సేవల రంగంలో భారీగా ఉద్యోగాలకు కోతపడే అవకాశం ఉందని ఆ దేశ వ్యాపారవేత్త, డెమోక్రటిక్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న 7 కోట్ల వైట్‌కాలర్ ఉద్యోగాల్లో వచ్చే 12 నుంచి 18 నెలల్లో 25 శాతం నుంచి 50 శాతం వరకు (3.5 కోట్లు) ఉద్యోగాలు పోతాయని అంచనా వేశారు. ‘ఉద్యోగులను తగ్గిస్తే స్టాక్ మార్కెట్ సానుకూలంగా స్పందిస్తుంది. తగ్గించకపోతే మరోరకంగా స్పందిస్తుంది. ఒక కంపెనీ తన ఉద్యోగుల్లో కోత పెడితే.. ఇతర పోటీ కంపెనీలు కూడా అదే పని చేస్తాయి. ముఖ్యంగా కోడర్స్, ఆఫీస్ సహాయకులు, మిడిల్ మేనేజర్స్, కాల్‌సెంటర్ ఉద్యోగులు, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేసేవారికి ఏఐ వల్ల ప్రమాదం ఉంది. ఈ ప్రభావం వైట్‌కాలర్ ఉద్యోగాలను దాటి కూడా ఉంటుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కొలువు ఊడిపోతే అతడు లాండ్రీకి తన బట్టలు వేయడు. తన కుక్క సంరక్షకుడిని తొలగించి తానే స్వయంగా దానిని చూసుకుంటాడు. బార్బర్ సెలూన్‌కు వెళ్లటం కూడా తగ్గిస్తాడు. ఇలా ఒక్క ఉద్యోగం పోవటం వల్ల ఆ తర్వాత నాలుగైదు ఉద్యోగాలు పోతాయి’ అని పేర్కొన్నారు. అయితే, యాంగ్ అభిప్రాయంతో జేపీ మోర్గాన్ సంస్థ విబేధించింది. 2025లో కోల్పోయిన 12 లక్షల ఉద్యోగాల్లో 55 వేలు మాత్రమే ఏఐ వల్ల పోయాయని గుర్తు చేసింది.