Share News

అంటార్కిటికా మంచు కింద ‘మహా పర్వతాలు’

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:57 AM

దక్షిణ ధ్రువం చుట్టూ విస్తరించి ఉన్న అంటార్కిటికా మంచు పొరల కింద మరో ప్రపంచాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు.

అంటార్కిటికా మంచు కింద ‘మహా పర్వతాలు’

  • హిమాలయాలంత పరిమాణంలో ప్రాచీన పర్వతాల గుర్తింపు

న్యూఢిల్లీ, నవంబరు 22: దక్షిణ ధ్రువం చుట్టూ విస్తరించి ఉన్న అంటార్కిటికా మంచు పొరల కింద మరో ప్రపంచాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయాల అంతటి పరిమాణంలో ఉన్న ప్రాచీన మహాపర్వతాల ఆనవాళ్లను వారు కనుగొన్నారు. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌యూ), జర్మనీకి చెందిన జీఎ్‌ఫజెడ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ర్‌ జియో సైన్సెస్‌ శాస్త్రవేత్తల బృందం ఈ కీలక ఆవిష్కరణ చేసింది. సుమారు 650 మిలియన్‌ నుంచి 450 మిలియన్‌ సంవత్సరాల క్రితం ‘గోండ్వానా’ అనే మహాఖండం ఏర్పడే క్రమంలో అంటార్కిటికా... భారతదేశం, ఆఫ్రికాతో ఢీకొనడం వల్ల ఈ భారీ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయని, అంటార్కిటికా చరిత్రలో ఇదే అతిపెద్ద పర్వత నిర్మాణ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటార్కిటికాలో 99.5 శాతం కంటే ఎక్కువ భూభాగం మంచుతో కప్పబడి ఉండడం వల్ల.. నేరుగా రాళ్లను పరీక్షించడం సాధ్యంకాదు. కాబట్టి.. అంటార్కిటికా ఖండపు అంచుల వెంబడి సముద్రంలో డ్రిల్లింగ్‌ చేసి సేకరించిన అవక్షేపాల నుంచి 1,712 సూక్ష్మ జిర్కాన్‌ ఖనిజ రేణువులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వాటి భూరసాయన కూర్పు కారణంగా, ఈ స్ఫటికాలు అవి ఏర్పడిన నాటి పీడన పరిస్థితులు, సమయానికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి. ఈ నమూనాల అధారంగా శాస్త్రవేత్తలు శిలల వయస్సును నిర్ధారించగలిగారు. అలాగే అవి ఏ భౌగోళిక ప్రక్రియ ద్వారా ఏర్పడ్డాయో ఊహించగలిగారు. మంచు పలకలు సముద్రం వైపు ఎంత వేగంగా జారుతున్నాయో అంచనా వేయడంలో ఈ ఆవిష్కరణ ఉపయోగపడనుంది.

Updated Date - Nov 23 , 2026 | 03:59 AM