డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకొన్న అమెరికా
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:28 AM
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా గురువారం అధికారికంగా వైదొలిగింది. 1948లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా ప్రారంభమైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌వోలో 78 ఏళ్లపాటు అమెరికా కీలక భాగస్వామిగా ఉంటూ వచ్చింది.
వాషింగ్టన్, జనవరి 23: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా గురువారం అధికారికంగా వైదొలిగింది. 1948లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా ప్రారంభమైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌వోలో 78 ఏళ్లపాటు అమెరికా కీలక భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఈ సంస్థకు అత్యధిక విరాళాలు ఇచ్చే దేశం కూడా అమెరికానే. ఈ సంస్థ మొత్తం వార్షిక బడ్జెట్ 5.8 బిలియన్ డాలర్లు కాగా, అందులో దాదాపు పావు వంతు నిధులు అమెరికా ఒక్కటే అందిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా తప్పుకొంటున్నట్లు గతేడాది జనవరిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. డబ్ల్యూహెచ్‌వో రాజ్యాంగం ప్రకారం ఒకదేశం తన సభ్యత్వాన్ని రద్దుచేసుకోవాలంటే సంవత్సరం ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా నోటీసు ఇచ్చి ఏడాది పూర్తి కావటంతో గురువారం అధికారికంగా సంస్థ నుంచి బయటకు వచ్చింది. కాగా, సభ్యదేశాలు ఇచ్చే విరాళాలతోనే డబ్ల్యూహెచ్‌వో నడుస్తోంది. అయితే, అందరికంటే ఎక్కువ విరాళాలు ఇస్తున్న తమకు సంస్థలో తగిన గౌరవం లభించటంలేదని ట్రంప్ విమర్శించారు. సంస్థలో అవినీతి పెరిగిపోయిందన్నారు. అమెరికా వైదొలగటంతో డబ్ల్యూహెచ్‌వోకు నిధుల కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ దేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థకు దాదాపు 130 మిలియన్ డాలర్లు బకాయి ఉంది. ఇకపై ఆ నిధులు కూడా వచ్చే అవకాశం లేదని సమాచారం. కాగా, డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా బయటకు రావటాన్ని ఆ దేశంలోని పలువురు ప్రముఖులు తప్పుబట్టారు. ఇది తొందరపాటు చర్య అని అమెరికా అంటువ్యాధుల సొసైటీ అధ్యక్షుడు రొనాల్డ్ నహాస్ అభిప్రాయపడ్డారు.