అమెరికాకు క్షిపణుల కొరత
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:51 AM
ఇరాన్‌లో ఐదు వారాలుగా విధ్వంసం సృష్టిస్తున్న అమెరికాకు.. ఇప్పుడు అతిపెద్ద సమస్య వచ్చిపడింది. శత్రువు గగనతల రక్షణ వ్యవస్థకు దొరక్కుండా దూసుకెళ్లి లక్ష్యాన్ని తుత్తునియలు...
తరిగిపోతున్న జేఏఎస్ఎస్ఎం-ఈఆర్ క్రూయిజ్ క్షిపణులు
ప్రస్తుతం ఆ దేశం వద్ద ఉన్నవి 425 జేఏఎస్ఎస్ఎంలే
వాషింగ్టన్, ఏప్రిల్ 5: ఇరాన్‌లో ఐదు వారాలుగా విధ్వంసం సృష్టిస్తున్న అమెరికాకు.. ఇప్పుడు అతిపెద్ద సమస్య వచ్చిపడింది. శత్రువు గగనతల రక్షణ వ్యవస్థకు దొరక్కుండా దూసుకెళ్లి లక్ష్యాన్ని తుత్తునియలు చేయగల జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్-ఎక్ట్సెండెడ్ వర్షన్ (జేఏఎస్ఎస్ఎం-ఈఆర్) స్టెల్త్ క్రూయిజ్ క్షిపణులు తరిగిపోయాయి. ఇరాన్‌తో యుద్ధానికి ముందు జేఏఎస్ఎస్ఎం దీర్ఘశ్రేణి క్షిపణులు అమెరికా వద్ద 2,300 ఉండగా, ప్రస్తుతం 425 మాత్రమే మిగిలినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ క్షిపణులు దాదాపు 965 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఒక్కో క్షిపణి ధర రూ.9 కోట్లకు పైమాటే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మిలిటరీ బేస్‌లలో ఉన్న ఈ 425 క్షిపణులను అమెరికా సెంట్రల్ కమాండ్ బేస్‌లకు లేదా యూకేలోని ఫెయిర్‌ఫీల్డ్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ఇవి 17 బీ-1బీ విమానాలు ఒకసారి వాడటానికి సరిపోతాయని చెబుతున్నారు. దీంతో యుద్ధం ఇంకా ఎక్కువకాలం కొనసాగితే పరిస్థితి ఏమిటని అమెరికా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ క్షిపణులను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసింది. అయితే, జేఏఎస్ఎస్ఎంలు తరిగిపోయినా.. అమెరికా వద్ద యుద్ధంలో వాడటానికి ఆయుధాలే లేనట్లు కాదని ఆ అధికారులు పేర్కొన్నారు. ఈ క్షిపణులను అమెరికా విరివిగా వాడటానికి కారణం శత్రువుకు అందనంత దూరం నుంచి ప్రయోగించే అవకాశం ఉండటమే. శత్రువు ఎదురు దాడి చేస్తే తన విమానాలకు నష్టం కలగకుండా తప్పించుకొనేందుకు వీలుగా అమెరికా వైమానిక దళం ఇరాన్ యుద్ధంలో ఈ క్షిపణులను వాడినట్లు చెబుతున్నారు.