Share News

అమెరికా లేజర్‌ వార్‌!

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:58 AM

ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా లేజర్‌ ఆయుధాలను మోహరిస్తోంది. ఇరాన్‌ ఆయుధాలే లక్ష్యంగా, తమ ఉపగ్రహాలు, మిలిటరీ గ్రేడ్‌ మాల్‌వేర్‌....

అమెరికా లేజర్‌ వార్‌!

  • పశ్చిమాసియా తీరంలో డెస్ట్రాయర్‌ యుద్ధనౌకపై ‘హెలియోస్‌’

  • వందలాది ఇరాన్‌ క్షిపణులను లేజర్‌తో కూల్చేసినట్లు కథనాలు

న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా లేజర్‌ ఆయుధాలను మోహరిస్తోంది. ఇరాన్‌ ఆయుధాలే లక్ష్యంగా, తమ ఉపగ్రహాలు, మిలిటరీ గ్రేడ్‌ మాల్‌వేర్‌, రాడార్‌లను జామ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌లను అమెరికా ఉపయోగిస్తోందని న్యూయార్క్‌ పోస్ట్‌ తన కథనంలో వెల్లడించింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ విడుదల చేసిన ఓ వీడియోలో పశ్చిమాసియాలోని ఓ తీరంలో యూఎస్‌ డెస్ట్రాయర్‌ నౌకపై ఓ కొత్త ఆయుధం ఉన్న దృశ్యాలు ఉన్నాయి. అది అత్యంత శక్తిమంతమైన లేజర్‌తో కూడిన ఆప్టికల్‌ డేజ్లర్‌, నిఘా (హెలియోస్‌) వ్యవస్థలా కనిపిస్తోంది. ఆ పరిక రం కావాల్సిన విధంగా తిరుగుతూ, శక్తితో కూడి న తీవ్రమైన, స్థిరంగా ఉండే లేజర్‌ బీమ్‌ను విడుదల చేస్తుంది. దీనితో డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దుల మీదుగా వస్తున్న రాకెట్లు.. వాటిని ప్రయోగించిన కొద్ది సెకన్లలోనే పేలిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో దర్శనం ఇస్తున్నాయి. రాకెట్లను ప్ర యోగించిన వెంటనే అవి విడుదల చేసిన వేడిని బట్టి ఉపగ్రహాల్లోని ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లు గుర్తిస్తాయని, ఆ సమాచారంతో వాటిని కచ్చితత్వం తో అడ్డుకోవడంగానీ, కూల్చివేయడంగానీ చేయవచ్చని జాన్స్‌ హాప్‌కిన్స్‌ వర్సిటీ స్పేస్‌ ఫోర్స్‌ కార్యక్రమం మాజీ అధ్యాపకుడు బ్రెంట్‌ డేవిడ్‌ జియార్నిక్‌ చెప్పారు. ఈ సాంకేతికతను ఉపయోగించే ఇరాన్‌ ప్రయోగించిన వందలాది క్షిపణులను కూల్చేశారని ఏబీసీ న్యూస్‌ పేర్కొంది. యూఎస్‌ కేంద్రంగానే స్పేస్‌ ఫోర్స్‌ పనిచేస్తుంది. రాడోమ్స్‌ అని పిలిచే రాడార్‌ డోమ్స్‌ నుంచి క్రూ సభ్యులు పనిచేస్తారు. రియల్‌ టైమ్‌ సమాచారంతో క్షిపణుల లక్ష్యాన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో లేజర్‌ ఆయుధాలను వినియోగిస్తున్నామని గానీ, లేదని గానీ అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు వెల్లడించలేదు.

1000 మందికి పైగా పౌరులు మృతి

యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటి ఐదురోజుల్లో 1000 మందికిపైగా పౌరులు మృతిచెందారని యూఎస్‌ నుంచి పనిచేసే మానవహక్కుల కార్యకర్తల న్యూస్‌ ఏజెన్సీ (హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ) పేర్కొంది. చనిపోయిన వారిలో 10 ఏళ్ల లోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియా ప్రాంతంలో 5 వేల మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.

Updated Date - Mar 06 , 2026 | 03:58 AM