Share News

రంగంలోకి ఎఫ్‌-22 రాప్టర్‌ ఫైటర్లు!

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:00 AM

అణు ఒప్పందం విషయంలో ఎంతకూ దిగిరాకపోవడంతో ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచేదిశగా అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

రంగంలోకి ఎఫ్‌-22 రాప్టర్‌ ఫైటర్లు!

  • అత్యాధునిక స్టెల్త్‌ జెట్లను ఇజ్రాయెల్‌కు తరలించిన అమెరికా.. త్వరలోనే ఇరాన్‌పై దాడి?

టెల్‌ అవీవ్‌, ఫిబ్రవరి 25: అణు ఒప్పందం విషయంలో ఎంతకూ దిగిరాకపోవడంతో ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచేదిశగా అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ దేశ అమ్ములపొదిలోని అత్యంత కీలకమైన స్టెల్త్‌ ఫైటర్‌ ఎఫ్‌-22లను ఇజ్రాయెల్‌కు తరలించింది. ఇప్పటికే రెండు భారీ విమానవాహక యుద్ధ నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను మధ్య ప్రాచ్యంలో మోహరించిన అమెరికా ఇప్పుడు ఎఫ్‌-22 రాప్టర్‌ ఫైటర్లను కూడా తరలించడం త్వరలో ఇరాన్‌పై దాడి మొదలవుతుందనే దానికి సంకేతమని ఇజ్రాయెల్‌ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలతో టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ తాజాగా కథనం ప్రచురించింది. యూకేలోని లాకెన్‌హీత్‌ ఎయిర్‌బే్‌సలోని ఈ ఫైటర్లను ఇరాన్‌కు సమీపంలో అందుబాటులో ఉండేలా ఇజ్రాయెల్‌కు తరలించినట్టు పేర్కొంది. ఎఫ్‌-22 రాప్టర్లు ప్రపంచంలోనే అత్యాధునికమైనవి. శత్రుదేశాల నిఘాకు, రాడార్లకు దొరకకుండా చొరబడి.. క్షిపణి రక్షక వ్యవస్థలు, రాడార్‌ వ్యవస్థలను ధ్వంసం చేయగల సామర్థ్యం వీటి సొంతం. ముందుగా వీటితో శత్రుదేశాల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తే.. తర్వాత క్షిపణులతో, మిగతా ఫైటర్లతో విరుచుకుపడి కీలక లక్ష్యాలను ధ్వంసం చేయడం సులువు అవుతుంది. ఇప్పుడు అమెరికా దాడి మొదలుపెడితే.. ఇరాన్‌ గగనతలంలోకి మొదటగా ప్రవేశించేది ఎఫ్‌-22 రాప్టర్‌ ఫైటరేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 02:00 AM