ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌అలీ లారీజాని మృతి!
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:11 AM
సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు మరోపెద్ద దెబ్బ తగిలింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కోర్.....
బసిజ్ ఫోర్స్ కమాండర్ కూడా..
దాడుల్లో చనిపోయారన్న ఇజ్రాయెల్
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 17: సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు మరోపెద్ద దెబ్బ తగిలింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) పారామిలిటరీ దళం ‘బసిజ్ ఫోర్స్’ కమాండర్ గోలం రెజా సోలేమానీతోపాటు పెద్ద సంఖ్యలో మిలిటరీ ఉన్నతాధికారులు తమ దాడుల్లో మృతిచెందారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించారు. ‘‘ఇరాన్ మతవాద నాయకత్వాన్ని ఒక్కసారిగా, సులువుగా తుడిచిపెట్టేయలేం. కానీ ఇజ్రాయెల్ తలచుకుంటే సాధ్యమవుతుంది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ అధినేత అలీ లారిజానీని అంతం చేశాం. ఇరాన్ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి, తమ భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం వచ్చింది’’ అని పేర్కొన్నారు. అంతకుముందు టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్, అహ్వాజ్, ఇస్ఫహాన్ పట్టణాలపై డజన్లకొద్దీ ఫైటర్లతో ఏకకాలంలో దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన కీలక కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, ఇరాన్ అంతర్గత భద్రత, నిఘా విభాగం, బసిజ్ మిలీషియా ప్రధాన కార్యాలయాలతోపాటు క్షిపణులు, డ్రోన్ల నిల్వ స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. .
అయతొల్లా అలీ ఖమేనీ తర్వాత కీలక నేత
1958లో ఇరాక్‌లోని నజా్‌ఫలో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ మతగురువు. గణితం, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని స్థాపించిన రుహొల్లా ఖొమేనీ సన్నిహితుడైన మతపెద్ద కుమార్తెను లారిజానీ వివాహం చేసుకున్నారు. తొలుత ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్‌లో చేరారు. తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా, ఇరాన్ అధికారిక టీవీ చీఫ్‌గా, ఇరాన్ పార్లమెంటు స్పీకర్‌గా పనిచేశారు. 2015లో అమెరికాతో అణు ఒప్పందంలో కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తర్వాత శక్తివంతమైన నేతగా అలీ లారిజానీ గుర్తింపు పొందారు. అలీ ఖమేనీకి కుడి భుజంగా వ్యవహరించిన ఆయన.. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల అభివృద్ధి, అణు కార్యక్రమం తదితర అంశాల్లో కీలకపాత్ర పోషించారు. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్‌కు చెందిన అన్ని భద్రతా బలగాలను ఆయనే పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ నెల 13న టెహ్రాన్‌లో నిర్వహించిన అల్-ఖడ్స్ ర్యాలీలో లారిజానీ చివరిసారిగా కనిపించారు. ఇక 1964లో జన్మించిన సోలేమాని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్‌లో సాధారణ సైనికుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఇరాన్, ఇరాక్ యుద్ధం సమయంలో బెటాలియన్ కమాండర్‌గా పనిచేశారు. 2019 నుంచి పారామిలిటరీ విభాగం బసిజ్ ఫోర్సె్‌సకు చీఫ్‌గా కొనసాగుతున్నారు. సుమారు 4.5 లక్షల మంది సిబ్బంది ఉన్న బసిజ్ ఫోర్సెస్ ఇరాన్ అంతర్గత భద్రత విధుల్లో కీలకంగా వ్యవహరిస్తుంది.

లారిజానీ పేరిట నోట్ విడుదల!
అలీ లారిజానీ, గోలం రెజా సోలేమాని మృతిచెందారన్న ఇజ్రాయెల్ ప్రకటనను ఇరాన్ నేరుగా ఖండించలేదు. అయితే ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన ఇరాన్ సైనికులకు లారీజానీ సంతాపం ప్రకటిస్తున్నట్టుగా చేతిరాతతో కూడిన ప్రతిని మాత్రం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కనీసం ఎలాంటి దృశ్యాలనూ ప్రసారం చేయలేదు. లారిజానీ మృతిచెంది ఉండవచ్చన్న దానికి ఇది సంకేతమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు
కువైట్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్, యూఏఈలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగాయి. గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థలు వాటిలో చాలా వరకు అడ్డుకున్నాయి. డ్రోన్లు, క్షిపణుల శకలాలు పడి అబుధాబిలో ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించారు. కువైట్‌లో ఇద్దరు వైద్య సిబ్బంది గాయపడ్డారు.