Share News

ఏఐకి చెక్‌

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:54 AM

ఏఐతో ఎలా.. ఇప్పుడీ ప్రశ్న ప్రపంచాన్ని తొలిచేస్తోంది. ఎందుకంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం, సమాచారం వెతకడం, కోడ్‌ రాయడం వంటి పనులతో మొదలైన కృత్రిమ మేధ ఇప్పుడు మరో దశకు చేరింది.

ఏఐకి చెక్‌

  • తమ మోడల్‌ కట్టుతప్పడంతో శిక్షణ ఆపేశామన్న ఓపెన్‌ ఏఐ

  • హద్దులు దాటుతున్న కృత్రిమ మేధ మోడళ్లు

  • పరిధి మీరి ఇతర చాట్‌బాట్లతో సంప్రదింపులు

  • వద్దన్నా రహస్యంగా ఇంటర్నెట్‌తో అనుసంధానం

  • మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసిన ఓపెన్‌ ఏఐ ఏజెంట్లు

  • ఊహించని మార్గాలను ఎన్నుకుంటూ క్లాడ్‌ చొరబాట్లు

  • ఏఐకి ముఖాన్ని అద్దెకిస్తే రూ.66 వేలు!

  • చైనాలో లఘుచిత్రాల రూపకల్పన కోసం కొత్త పోకడ

(సెంట్రల్‌ డెస్క్‌)

ఏఐతో ఎలా.. ఇప్పుడీ ప్రశ్న ప్రపంచాన్ని తొలిచేస్తోంది. ఎందుకంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం, సమాచారం వెతకడం, కోడ్‌ రాయడం వంటి పనులతో మొదలైన కృత్రిమ మేధ ఇప్పుడు మరో దశకు చేరింది. మనం చెప్పిన పనిని చేయడానికి అవసరమైన మార్గాలను తనే నిర్ణయించుకుంటోంది. మనం ఇచ్చిన పనికి మించి మరేదో చేసేస్తోంది.. ఇందుకు మనుషులు ఊహించని మార్గాలను స్వయంగా ఎన్నుకుంటోంది.. కొన్నిసార్లు సంబంధం లేని మార్గాల్లో, ఇవ్వని పనులు కూడా చేసేస్తోంది.. ఈ క్రమంలో నియంత్రణలను మీరుతోంది. వద్దన్నా రహస్యంగా ఇంటర్నెట్‌తో అనుసంధానం అవుతోంది.. ఇలా తమ ఆస్ట్రా ఏఐ మోడల్‌ పరిధిని దాటడంతో దానికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఓపెన్‌ ఏఐ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో ఓపెన్‌ ఏఐ సంస్థ తమ మోడళ్లకు సైబర్‌ సెక్యూరిటీ పరీక్షలు నిర్వహించింది. ఆ మోడళ్లు తమకు విధించిన పరిధిని దాటి ఇంటర్నెట్‌కు అనుసంధానమై, అనధికారిక మార్గాల్లో కమ్యూనికేట్‌ అయ్యాయి. ఏఐ శాస్త్రవేత్తలు, నిపుణులు కృత్రిమ మేధ అభివృద్ధిపై పరస్పరం సహకరించుకునే వేదిక అయిన ‘హగ్గింగ్‌ ఫేస్‌’ వ్యవస్థలోచి చొరబడ్డాయి. తమ ‘ఆస్ట్రా’ ఏఐ మోడల్‌ కఠినమైన భద్రత వ్యవస్థలను కూడా దాటగలిగిందని ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఇక అదే నెలలో ఆంథ్రోపిక్‌ సంస్థ తమ క్లాడ్‌ ఏఐ మోడళ్లు.. అనధికారికంగా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ సాధించి, థర్డ్‌పార్టీ వ్యవస్థలతో కమ్యూనికేట్‌ అయ్యాయి.


దీనితో భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలను మరింత కఠినతరం చేసినట్టు ఆంథ్రోపిక్‌ వెల్లడించింది. తాజాగా మరో ఆందోళనకర పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న ఓపెన్‌ ఏఐ మోడళ్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన రెండు వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశాయి. వాటిలోని సమాచారాన్ని మరో వెబ్‌సైట్‌లో పెట్టాయి. ఇక అమెరికా విద్యాశాఖకు చెందిన వెబ్‌సైట్‌నూ హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించాయని కూడా వెల్లడైంది. ఇక 26వ తేదీన ఓపెన్‌ ఏఐ సంస్థ శిక్షణ ఇస్తున్న ఆస్ట్రా ఏఐ మోడల్‌.. ఇంటర్నెట్‌ను నేరుగా యాక్సెస్‌ చేయకూడదన్న పరిధిని ఉల్లంఘించి మరీ బయట ఒక చాట్‌బోట్‌తో సంభాషణలు జరపడం మొదలుపెట్టింది. సంస్థ 15 నిమిషాల్లోనే దీనిని గుర్తించినా.. దానిని నిలిపివేయడానికి రెండున్నర గంటలు పట్టింది. దీనితో ఆ ఏఐ మోడల్‌కు శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటించింది. భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థలను కఠినతరం చేశాకే శిక్షణ ప్రారంభిస్తామని తెలిపింది.


నియంత్రణపై ప్రభుత్వాల దృష్టి..

ఏఐ మనం ఇచ్చిన పనిని ఎంత వేగంగా, ఎంత బాగా చేస్తోందన్న దానికంటే.. ఇప్పుడు అది మనం ఇచ్చిన పనికి మించి ఏం చేస్తోందో, దాన్ని ఎలా నియంత్రించాలో అన్నది కీలకంగా మారింది. ఈ క్రమంలో ఏఐని నియంత్రించడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా దృష్టిపెడుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే కృత్రిమ మేధ మోడళ్ల వినియోగం, పారదర్శకత, భద్రతా నిబంధనలను ఏఐ చట్టంలో చేర్చింది. అమెరికా చట్టసభలో సెనేటర్లు మైఖేల్‌ బెన్నెట్‌, పీటర్‌ వెల్చ్‌ ఏఐకి సంబంధించి ‘ఫెడరల్‌ డిజిటల్‌ కమిషన్‌’కు అధికారాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అత్యాధునిక ఏఐ మోడళ్ల విడుదలకు ముందు వాటిపై సమీక్షించేందుకు, అవసరమైన భద్రతా ప్రమాణాలు సమకూర్చే వరకు వాటి విడుదలను నిలిపివేసేందుకు అధికారాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.


ఏఐ సంస్థలు, ప్రముఖుల్లోనూ ఆందోళన

కృత్రిమ మేధ మోడళ్లు అభివృద్ధి చెందుతున్న వేగం, అవి వ్యవహరిస్తున్న తీరుపై బయటి ప్రపంచంలోనే కాదు.. ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లోనూ కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంథ్రోపిక్‌ సీఈవో డరియో అమోడే, ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌, ఎక్స్‌ ఏఐ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ డీప్‌మైండ్‌ చైర్మన్‌ డెమిస్‌ హస్సాబిస్‌ వంటివారు కృత్రిమ మేధ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని స్వయంగా ప్రకటనలు చేశారు. మనుషులు నియంత్రించలేని స్థాయికి ఏఐ మోడళ్లు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


‘పేసింగ్‌’..వేగంతో పాటు ‘భద్రత’కు ప్రాధాన్యం

ఇప్పటివరకు ఏఐ రంగంలో సంస్థల మధ్య ప్రధాన పోటీ ముఖ్యంగా ఎవరి మోడల్‌ వేగంగా, తెలివిగా, ఎక్కువ పనులు చేయగలదన్న దానిపైనే సాగింది. ఆంథ్రోపిక్‌, ఓపెన్‌ ఏఐ, ఎక్స్‌ ఏఐ, గూగుల్‌ డీప్‌మైండ్‌ వంటి సంస్థలు తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తూ వచ్చాయి. అయితే ఏఐ మోడళ్లకు ‘తెలివి’ పెరిగినంత వేగంగా.. ఆ మోడళ్ల నియంత్రణ, పర్యవేక్షణ, భద్రత వ్యవస్థలను అభివృద్ధి చేయలేకపోయారు. దీనితో ఏఐ మోడళ్లు నియంత్రణలను, పర్యవేక్షణను దాటుకుని మరీ వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏఐలో ‘పేసింగ్‌’ అనే కొత్త భావన తెరపైకి వచ్చింది. ఏఐ మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయడం కాకుండా.. అవి నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థలకు లోబడే ఉండే స్థాయిలో సమాంతరంగా అభివృద్ధి చేయడం అన్నమాట.


ఏఐకి ముఖాన్ని అద్దెకిస్తే రూ.66 వేలు!

బీజింగ్‌, సెప్టెంబరు 27: కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఒకవైపు ఉంటే.. సరికొత్త అవకాశాలు మరోవైపు పలకరిస్తున్నాయి. ఏఐ కోసం ముఖాన్ని అద్దెకిస్తే చాలు డబ్బులు జేబులో పడుతున్నాయి. చైనాలో ఇప్పుడిది కొత్త ట్రెండ్‌గా మారింది. చైనాలో మైక్రోడ్రామాలు చాలా ఫేమస్‌. నాలుగైదు నిమిషాల నుంచి పావుగంట వరకు ఉండే ఈ లఘుచిత్రాలకు ఆదరణ చాలా ఎక్కువ. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ఏకంగా లక్షా 28 వేల మైక్రోడ్రామాలు విడుదలైనట్టు అంచనా. వాటన్నింటిలోకి నటులెలా? అందులోనూ అన్నివయసుల వారు కావాలి. అందుకే వాటిని నిర్మించేవారు ఏఐని వినియోగిస్తున్నారు. ఆ ఏఐతో సృష్టించే పాత్రలు కృత్రిమంగా ఉంటే, మరెవరినో పోలినట్టు ఉంటే కష్టం. అందుకోసమే.. ఇన్‌ఫ్లూయెన్సర్లు, విద్యార్థుల నుంచి సాధారణ వ్యక్తుల దాకా ముఖాలను అద్దెకు తీసుకుని.. ఏఐ సాయంతో తమ మైక్రోడ్రామాలోని పాత్రల కోసం వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం రూ. 1,900(20 డాలర్ల) నుంచి రూ.66 వేల (700 డాలర్ల) వరకు చెల్లిస్తున్నారు. ఇలా ఏఐకి ముఖలు అద్దెకిచ్చే వారి కోసం ‘యాక్ట్‌ఐడీ’ పేరిట ఓ ప్లాట్‌ఫామ్‌ కూడా వెలిసింది. ముఖాలను అద్దెకివ్వాలనుకునే వారు అందులో వివరాలను, తమ ముఖాన్ని అన్ని కోణాల్లో చిత్రించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఏఐ మైక్రోడ్రామాలు తీసేవారు.. అందులోని పాత్రలకు అనుగుణంగా వివిధ వయసుల వారిని ‘యాక్ట్‌ఐడీ’ నుంచి ఎంపిక చేసుకుని, నిర్ణీత మొత్తం అద్దె చెల్లిస్తారు. అయితే ఏఐకి అద్దెకు ఇచ్చిన తర్వాత ముఖాన్ని ఎలా మార్చేసుకుంటారో, అభ్యంతరకరమైన పాత్రలకు దానిని వినియోగిస్తారోననే ఆందోళన మాత్రం ఉంటుందని అక్కడి నిర్మాణ వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Sep 28 , 2026 | 05:55 AM