Share News

యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది..?

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:32 AM

ఇరాన్‌పై అమెరికా దాడి చేసే తేదీని ఏఐ మోడల్‌ గ్రోక్‌ ముందుగానే చెప్పిందని ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ప్రచారాలు వైరల్‌గా మారాయి..

యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది..?

  • పలు ఏఐ మోడళ్లకు ప్రశ్న

  • ఫిబ్రవరి 28 అని కచ్చితంగా చెప్పిన ‘గ్రోక్‌’

న్యూఢిల్లీ, మార్చి 1: ఇరాన్‌పై అమెరికా దాడి చేసే తేదీని ఏఐ మోడల్‌ గ్రోక్‌ ముందుగానే చెప్పిందని ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ప్రచారాలు వైరల్‌గా మారాయి. అయితే అది అంచనా మాత్రమేనని, దాడుల గురించి దానికి ముందస్తు సమాచారం లేదని పరీశీలనల్లో తేలింది. ఇరాన్‌పై అమెరికా ఎప్పుడు దాడి చేయబోతోందనే విషయంపై ఏఐ మోడళ్ల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ‘ది జరుసలేం పోస్ట్‌’ అనే వార్తా సంస్థ ఫిబ్రవరి 25న ప్రముఖ ఏఐ మోడళ్లు ఆంత్రోపిక్‌ క్లౌడ్‌, గుగుల్‌ జెమినీ, ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, ఎక్స్‌ఏఐ గ్రోక్‌ను ప్రశ్నించింది. కాగా, జెనీవాలో జరుగుతున్న చర్చల దృష్ట్యా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని గ్రోక్‌ కచ్చితమైన సమాధానం ఇచ్చింది. ఇతర మోడళ్లు మాత్రం అస్పష్ట తేదీలను పేర్కొన్నాయి. గ్రోక్‌ చెప్పినట్లుగానే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాలు ఇరాన్‌పై దాడులు జరపడంతో, యుద్ధ తేదీని గ్రోక్‌ ముందుగానే అంచనా వేసిందని అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై ఎక్స్‌ఏఐ యజమాని ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. భవిష్యత్తును అంచనా వేయగలగడం మేధస్సుకు ఉత్తమ ప్రమాణం అని పేర్కొన్నారు. అయితే గ్రోక్‌కు ముందస్తు సమాచారం ఉందని కానీ, అది భవిష్యత్తును అంచనా వేయగలదని ఎక్కడా చెప్పలేదు.

Updated Date - Mar 02 , 2026 | 02:32 AM