ఏఐ మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:50 AM
కృత్రిమమేధ (ఏఐ) సామర్థ్యాల్లో వేగంగా చోటుచేసుకుంటున్న ప్రగతి కారణంగా సమీప భవిష్యత్తులోనే తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చని, ఏఐ మీద మానవులు..
ఒపెన్‌ఏఐ బోర్డు సభ్యుడు పాల్ క్రిస్టియానో హెచ్చరిక
వాషింగ్టన్, సెప్టెంబరు 11: కృత్రిమమేధ (ఏఐ) సామర్థ్యాల్లో వేగంగా చోటుచేసుకుంటున్న ప్రగతి కారణంగా సమీప భవిష్యత్తులోనే తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చని, ఏఐ మీద మానవులు నియంత్రణ కోల్పోయే పరిస్థితులు తలెత్తవచ్చని పాల్ క్రిస్టియానో అనే సాంకేతిక నిపుణుడు హెచ్చరించారు. మానవ సమాజ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ సూపర్ ఇంటలిజెన్స్ పని చేసేలా నియంత్రించలేకపోతే అది మనుషుల మరణానికి కూడా దారితీస్తుందన్నారు. ఏఐ రంగంలోని కీలక కంపెనీల్లో ఒకటైన ఒపెన్‌ఏఐకి సంబంధించిన ‘ఫౌండేషన్ బోర్డు, సేఫ్టీ సెక్యూరిటీ కమిటీ’లో స్వతంత్ర సభ్యుడిగా పాల్ క్రిస్టియానో బుధవారం చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, తనంతట తానే మెరుగుపర్చుకునే సూపర్ ఇంటలిజెన్స్ ఏఐను రూపొందించే దిశగా కంపెనీలు పోటీ పడుతున్నాయని, ఇది మానవాళికి వినాశకారిగా పరిణమిస్తుందంటూ ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసిన జాకబ్ కాక్సన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.