Share News

9/11 దాడులపై 1.73 లక్షల పత్రాలు విడుదల

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:20 AM

న్యూయార్క్‌లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడికి సంబంధించిన 1.73 లక్షల పేజీల రికార్డులను నగర మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ విడుదల చేశారు.

9/11 దాడులపై 1.73 లక్షల పత్రాలు విడుదల

న్యూయార్క్‌, సెప్టెంబరు 11: న్యూయార్క్‌లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడికి సంబంధించిన 1.73 లక్షల పేజీల రికార్డులను నగర మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ విడుదల చేశారు. ఆ దాడులు జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడిలో 2,977 మంది మరణించారు. అనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా 9,400 మంది ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్య సమస్యలకు సంబంధించిన రికార్డులను ఇంతవరకు రహస్యంగా ఉంచగా వాటిని ఇప్పుడు బహిర్గతపరిచారు. ఆ పత్రాలను ప్రజానీకానికి అందుబాటులో ఉంచాలని 9/11 హెల్త్‌వాచ్‌ అనే సంస్థ న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతాలు వెల్లడి కావడం గమనార్హం. దాడుల తరువాత విషవాయువులు వ్యాపించినట్టు అధికార యంత్రాంగానికి తెలుసునని, కానీ పరిహార బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు తక్కువ చేసి చూపించిందని మమ్దానీ తెలిపారు. విషవాయువులు వ్యాపించినా నాయకులు అబద్ధమాడి, నగరవాసుల నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పారు.

Updated Date - Sep 12 , 2026 | 06:21 AM