15 నిమిషాలే టైం..మా డిమాండ్లకు ఒప్పుకుంటారా.. చస్తారా?
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:19 AM
సైనిక ఆపరేషన్ ద్వారా ఈ నెల 3వ తేదీఅర్ధరాత్రి నాటి వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరి్‌సను అపహరించిన అమెరికా..
మదురో కిడ్నాప్ సమయంలో వెనెజువెలా నేతలకు అమెరికా సైనికుల అల్టిమేటం
ఓ సమావేశంలో స్వయంగా చెప్పిన తాత్కాలిక అధ్యక్షురాలు
కారకస్, జనవరి 25: సైనిక ఆపరేషన్ ద్వారా ఈ నెల 3వ తేదీఅర్ధరాత్రి నాటి వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరి్‌సను అపహరించిన అమెరికా.. ఆ సమయంలో ఇతర వెనెజువెలా నేతలను ఎంతగా భయభ్రాంతులకు గురిచేసిందో తెలిపే వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. మదురోను అపహరించిన ఏడు రోజుల తర్వాత వెనె జువెలా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తన మంత్రివర్గ సహచరులతో రహస్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మదురోను అపహరించిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఆ సమావేశానికి సంబంధించిన వీడియో లీక్ కావటంతో ఇప్పుడు సంచలనంగా మారింది. మదురో దంపతులను అమెరికా సైనికులు అపహరించిన తర్వాత వారి డిమాండ్లను తమ ముందు ఉంచి 15 నిమిషాల్లో వాటికి అంగీకరించకపోతే చంపేస్తామని బెదిరించినట్లు డెల్సీ తెలిపారు. ‘అధ్యక్షుడి (మదురో)ని అపహరించిన మరు నిమిషం నుంచే బెదిరింపులు మొదలయ్యాయి. వారి డిమాండ్లపై స్పందించేందుకు డియోస్దాడో (అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి)కు, జార్జ్ (రోడ్రిగ్జ్ సోదరుడు, ఆ దేశ కాంగ్రెషనల్ ప్రెసిడెంట్)కు, నాకు 15 నిమిషాల సమయమే ఇచ్చారు. ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తామన్నారు. మదురో దంపతులను కిడ్నాప్ చేయలేదని, చంపేశామని తెలిపారు. దీంతో మేము ముగ్గురం కూడా మరణించటానికే సిద్ధపడ్డాం’ అని సమావేశంలో రోడ్రిగ్జ్ చెబుతున్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. దేశంలో శాంతిని కాపాడటం, మదురో దంపతులను విడిపించటం, రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవటం అనే మూడు లక్ష్యాల సాధన కోసమే అమెరికాతో సంయమనంతో మెలుగుతున్నామని ఆమె చెప్పారు. అయితే, రోడ్రిగ్జ్ తనను తాను గొప్ప వ్యక్తిగా, దేశ రక్షకురాలిగా ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి మధ్య అంతర్గత పోరాటం వల్లనే మదురో దంపతులను అమెరికా అపహరించగలిగిందని పేర్కొంటున్నారు.