భారత్‌లో పెరిగిపోతున్న బాల ఊబకాయులు
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:49 AM
మన దేశంలో ఊబకాయులైన చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బాల ఊబకాయులు లేదా అధిక బరువు ఉన్న దేశాల్లో అమెరికాను వెనక్కి నెట్టి మనవాళ్లు రెండో స్థానంలో......
అమెరికాను దాటి రెండో స్థానానికి
5-9 మధ్య వయస్కుల్లో 1.4 కోట్ల మందికి ఊబకాయం : ప్రపంచ ఒబేసిటీ అట్లాస్ నివేదిక
న్యూఢిల్లీ, మార్చి 4: మన దేశంలో ఊబకాయులైన చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బాల ఊబకాయులు లేదా అధిక బరువు ఉన్న దేశాల్లో అమెరికాను వెనక్కి నెట్టి మనవాళ్లు రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో చైనా బాలలు ఉన్నారు. 5-9 ఏళ్ల మధ్య వయసున్న బాలలు 1.49 కోట్ల మంది, 10-19 ఏళ్ల మధ్య వయస్కులు 2.6 కోట్ల మంది ఊబకాయులు లేదా అధిక బరువు ఉన్నారని ప్రపంచ ఒబేసిటీ అట్లాస్-2026 తాజాగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 5-19 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరు (20.7శాతం) ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నారని తెలిపింది. 2010 నుంచి చూస్తే ఇది 14.6 శాతం పెరిగిందని చెప్పింది. 2025లో భారత్‌లో అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉన్న వారు 4.1 కోట్ల వరకు ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. చైనా విషయానికి వస్తే అధిక బీఎంఐ ఉన్న పిల్లలు 6.2 కోట్లు, ఊబకాయులు 3.3 కోట్ల మంది ఉన్నారు. అధిక బీఎంఐతో 2.7 కోట్ల మంది, ఊబకాయులు 1.3 కోట్ల మంది పిల్లలతో అమెరికా మూడో స్థానంలో ఉంది. ‘‘అధిక బరువు, ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య భారత్‌లో వేగంగా పెరుగుతోంది. అది ఏటా 5 శాతంగా ఉంటోంది. అది ఆందోళన కలిగించే అంశం. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం ఈ పరిస్థితికి కారణం’’ అని ప్రపంచ ఒబేసిటీ ఫెడరేషన్ సీఈవో జొహన్నా రాల్స్‌టన్ అన్నారు. .
ఆరోగ్యపరంగా రిస్క్ ఎక్కువ
2025-40 మధ్య చిన్న పిల్లల్లో ఊబకాయ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో ఒబేసిటీ అట్లాస్ అంచనా వేసింది. వాటి ప్రకారం.. భారత్‌లో బాల ఊబకాయల సంఖ్య 2 కోట్లకు పెరుగుతుంది. మొత్తంగా 5.6 కోట్ల మంది ఊబకాయులు లేదా అధిక బరువున్న వారు ఉంటారు.
అధిక బీఎంఐతో 5 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న వారిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.
రక్తపోటు బాధితులు 29 లక్షల నుంచి 42 లక్షలకు, మధుమేహ బాధితులు 13 లక్షల నుంచి 19 లక్షలకు, అధిక ట్రైగ్లిజరైడ్స్ బాధితులు 43 లక్షల నుంచి 60 లక్షలకు పెరుగుతారు.
ఈ అధిక బరువు వల్ల పిల్లల్లో రక్తపోటు, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి.
2040నాటికి 5.7 కోట్ల మందిలో ముందస్తు గుండెజబ్బు సూచనలు కనిపిస్తాయి. 4.3 కోట్ల మంది రక్తపోటు బాధితులు ఉంటారు.
ప్రపంచ ఒబేసిటీ ఫెడరేషన్ అంచనాల ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50కోట్ల మంది పిల్లలు ఊబకాయం లేదా అధిక బరువుతో ఉంటారు.
ఊబకాయానికి కారణాలు ఇవీ..
శారీరక శ్రమ లోపించడం వల్ల కౌమార దశలో ఉన్న 11-17 మధ్య వయసు పిల్లల్లో 74శాతం మంది ఊబకాయులు అవుతున్నారు. బడికి వెళ్లే పిల్లల్లో 35.5 శాతం మంది మాత్రమే బడిలో భోజనం చేస్తున్నారు. 6-10 ఏళ్ల మధ్య ఉన్నవారు సగటున రోజుకు 50 మిల్లీ లీటర్ల వరకు చక్కెర పానీయాలు తాగుతున్నారు. దాదాపు 32.6ు మంది శిశువులకు తల్లిపాలు సరిగ్గా అందడంలేదు. భారత భవిష్యత్‌తరాన్ని రక్షించడానికి అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఒబేసిటీ అట్లాస్ సూచించింది. పాఠశాలల పరిసరాల్లో సరైన ఆహార వాతావరణం, అనారోగ్య కారక ఆహార పదార్థాల మార్కెటింగ్ పట్ల సరైన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది.