ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్!
ABN , Publish Date - Mar 17 , 2026 | 07:03 AM
కొన్ని దశాబ్దాలుగా గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం ప్రధాన కారణంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దాన్ని హ్యూమన్ పాలిలోమా వైర్‌స(హెచ్‌పీవీ) దాటేసింది.
హెచ్‌పీ వైర్‌సలో 2 రకాలే దీనికి కారణం
న్యూఢిల్లీ, మార్చి 16: కొన్ని దశాబ్దాలుగా గొంతు క్యాన్సర్‌కు పొగ తాగడం ప్రధాన కారణంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దాన్ని హ్యూమన్ పాలిలోమా వైర్‌స(హెచ్‌పీవీ) దాటేసింది. ఓరల్ సెక్స్‌తో కూడిన లైంగిక సాంగత్యం వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. భారతదేశంలో ఇప్పటికీ గొంతు క్యాన్సర్‌కు పొగతాగడమే ప్రధాన కారణం అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో హెచ్‌పీవీ దాన్ని దాటేసి ప్రధాన కారణంగా నిలిచింది. చాలావరకు హెచ్‌పీవీ వైర్‌సలు వాటంతట అవే అంతమై పోతాయి. కానీ హెచ్‌పీవీ-16, హెచ్‌పీవీ-18 మాత్రం దేహంలోనే ఉంటూ క్యాన్సర్‌కు కారకం అవుతాయి. ఈ రెండు రకాల వైర్‌సలతో మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వస్తుందన్న విషయం ఎక్కువమందికి తెలిసిన విషయమే. ఇవి పెద్ద ఎత్తున గొంతు క్యాన్సర్‌కు కూడా కారణం అవుతున్నాయన్నది తాజా సర్వేల్లో వెల్లడవుతోంది. టాన్సిల్స్, నాలుక కుదురులో ఈ క్యాన్సర్ వస్తోంది. గొంతులో హెచ్‌పీవీ ద్వారా వచ్చే క్యాన్సర్‌కు ఓరల్ సెక్స్ కారణం అవుతోంది. చాలా పశ్చిమ దేశాల్లో గొంతు క్యాన్సర్ కారకాల్లో హెచ్‌పీవీ... పొగ తాగడాన్ని దాటేసింది. అయితే ఇది ఒక్కరోజులో జరిగే పరిణామం కాదు. పది నుంచి ముప్పై సంవత్సరాలు పడుతుంది. ఎక్కువ మందితో సంపర్కం, వారి పూర్వీకులు హెచ్‌పీవీ వ్యాక్సీన్ వేసుకొని ఉండకపోవడం ఈ పరిస్థితికి కారణం అని గురుగ్రామ్‌లోని ఫోర్టీస్ ఆసుపత్రి సర్జికల్ అంకాలజీ విభాగం ప్రధాన డైరెక్టర్ డాక్టర్ బి.నిరంజన్ నాయక్ అన్నారు. ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని ఆయన అన్నారు. రెండు వారాలకు మించి గొంతు నొప్పి, మింగడం కష్టమవడం, చెవినొప్పి, మెడలో, గొంతులో కణతి క్యాన్సర్ సూచన కావొచ్చని చెప్పారు. కేంద్రం సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లలోపు బాలికలకు ఇస్తున్న వ్యాక్సిన్ వల్ల భవిష్య తరాల్లో హెచ్‌పీవీ వ్యాప్తిని, తద్వారా గొంతు క్యాన్సర్‌ను అరికట్టడానికి ఉపయోగపడుతుందని అన్నారు. లైంగిక సంపర్కం వల్ల హెచ్‌పీవీ వ్యాపిస్తున్నందున బాలురకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే వాదన బలం పుంజుకుంటోంది.