సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ థీమ్ అర్థమైతే పట్టు లభించినట్టే!
ABN , Publish Date - Apr 06 , 2026 | 06:10 AM
మన దేశంలో జరిగే పోటీ పరీక్షల్లో మేరుపర్వతం అనదగ్గ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో మొదటి దశ ప్రిలిమ్స్ మే 24న జరుగనుంది.
మన దేశంలో జరిగే పోటీ పరీక్షల్లో మేరుపర్వతం అనదగ్గ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో మొదటి దశ ప్రిలిమ్స్ మే 24న జరుగనుంది. దరిమిలా రాబోయే ఏడెనిమిది వారాల్లో ఈ టెస్ట్ రాయబోయే అభ్యర్థుల ప్రిపరేషన్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన టిప్స్.
2025 మొదలుకుని వెనక్కు అంటే 2015 వరకు పదేళ్ళ ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయాలి వాటిలో అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధించి దాని వెనక ఉన్న థీమ్(ఇతివృత్తం)ను కూడా అర్థం చేసుకోవాలి.
ఉదాహరణకు ఫైనాన్స్ కమిషన్ సూచించే పన్ను బదిలీ విధానం. దీనిలో క్షితజ - సమాంతర విధానాలు ఉంటాయి. థీమ్ ఒక్కటే. అయితే ఒక్కో కమిషన్ ఒక్కో విధంగా సూచిస్తుంది. ప్రస్తుతం పదహారో ఫైనాన్స్ కమిషన్ ఉనికిలో ఉంది. థీమ్‌ని స్పష్టంగా అర్థం చేసుకుంటే కమిషన్ సూచించే పద్ధతులూ అవగతమవుతాయి.
ఒకే రకమైన థీమ్‌ని యూపీఎస్సీ అన్ని సబ్జెక్టులకూ వర్తింపజేస్తుంది. థీమ్‌ను అర్థం చేసుకోవడమే ఇక్కడ అసలు సిసలు నైపుణ్యం.
ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్‌లో స్థిర అంశాలకు అరవై శాతం వెయిటేజ్ ఉంటుంది. స్థిర, కరంట్ అఫైర్స్‌కు కలిపి 20 శాతం, అచ్చంగా కరంట్ అఫైర్స్‌కు 20 శాతం వెయిటేజ్ ఉంటాయి.
స్థిరమైనవాటికి సంబంధించి అయిదు కోర్ సబ్జెక్టులు ఉన్నాయి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎకాలజీ, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఇందులోకి వస్తాయి.
కరంట్ అఫైర్స్‌లో ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కేవలం వాస్తవాలపైనే కాకుండా అభ్యర్థి దృష్టి వాటి అన్వయం, ఉపయోగాలపై ఉండాలి.
ప్రీవియస్ ప్రశ్నపత్రాల అధ్యయనం
కాన్సెప్ట్ ఆధారిత, వాస్తవ అంశాలను ప్రత్యేకంగా డీల్ చేయాలి.
వాస్తవ అంశాలు అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన చిత్తడి నేలలు(రామ్సర్ సైట్స్), పర్వత మార్గాలు, ఆర్ట్, కరంట్ వివరాలు, పొలిటికల్ డేటాకు సంబంధించి ప్రత్యేక జాబితాను రూపొందించుకుని ప్రతి శనివారం తప్పనిసరిగా రివైజ్ చేసుకోవాలి.
చివరి పది రోజుల్లో ఎక్కువ సమయాన్ని ప్రీవియస్ పేపర్ల కోసం కేటాయించుకోవాలి. ప్రీవియస్ ప్రశ్నపత్రాలను పదేపదే చదవాలి. తద్వారా యూపీఎస్సీ ఉపయోగించే భాష, పదప్రయోగం, ప్రశ్న రూపొందించే సరళి తదితరాలన్నీ బాగా అర్థమవుతాయి. యూపీఎస్సీ ప్రశ్నించే విధానంపై ఎంత పట్టు సాధిస్తే అంత ప్రశాంతంగా పరీక్ష రోజున ఉండొచ్చు.
ఇటీవలి కాలంలో ప్రిలిమ్స్‌లో కటాఫ్ 92-95 మార్కుల మధ్య ఉంటోంది. అందుకే క్వశ్చన్ అటెంప్ట్ కంటే సమాధానం గుర్తింపులో అక్యురసీకి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
ఆక్యురసి(కచ్చితత్వం)ని పెంచుకుంటూ వెళ్ళడమే అసలైన స్థిరత్వం. నిజానికి అదే రియల్ గేమ్ అని అభ్యర్థి అర్థం చేసుకోవాలి.
జవాబులను గుర్తించే విషయంలో ప్రశ్నల ఎంపికకు ఒక ఆర్డర్ పెట్టుకోవాలి. బలం లేదంటే సబ్జెక్టు అదీ కాదంటే సులువు నుంచి కష్టం - వీటిలో ఏదో ఒక విధానాన్ని పాటించవచ్చు.
ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి రెంటిని లాజిక్‌తో తొలగించడం అంటే 50-50 చాన్స్‌కు అవకాశం ఇవ్వడం కిందే లెక్క. ఒక్క ఆప్షన్‌ను తొలగించలేని పక్షంలో ఆ ప్రశ్నను వదిలిపెట్టాలి.
మిస్టేక్ బుక్ మస్ట్
ప్రిలిమ్స్‌లో భాగమైన జనరల్ స్టడీస్, సీశాట్‌కు సంబంధించి ప్రతి ఆదివారం ఒక ఫుల్ మాక్ టెస్ట్ రాయాలి.
మాక్ టెస్ట్ అనేది మనకు ఉన్న పట్టును నిర్ధారించే పరికరం.
మాక్ టెస్ట్‌లో వచ్చే స్కోర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం అంటే తప్పుగా అర్థం చేసుకున్నట్టే.
చేసిన తప్పుల నుంచి తెలుసుకోవడమే అసలైన గుణపాఠం. అందుకు మిస్టేక్ బుక్‌ను మెయింటైన్ చేసుకోవాలి. దొర్లిన ప్రతి తప్పు అలాగే సందేహస్పదంగా ఉన్న ప్రతి ప్రశ్నను అందులో ఎంటర్ చేసుకోవాలి. సంబంధిత కరెక్ట్ కాన్సె్‌ప్టను కూడా దానికి జత చేసుకోవాలి.
ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు, మిస్టేక్ బుక్‌లో ఎంటర్ చేసుకున్న అన్ని టాపిక్స్‌ను రివైజ్ చేయాలి.
శనివారం మధ్యాహ్నం రివిజన్ మాత్రమే చేసుకోవాలి. కొత్త టాపిక్స్ వద్దు. కొత్తగా ఏమీ చదవకూడదు. ఆదివారం ఫుల్ మాక్ టెస్ట్ రాయాలి.
- కల్యాణ్ ఐనంపూడి, చీఫ్ మెంటార్, లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ అకాడమీ