Share News

తెలుగు విద్యార్థుల జయకేతనం

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:25 AM

ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్‌-2 పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించగా....

తెలుగు విద్యార్థుల జయకేతనం

  • జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు విడుదల

  • 26 మందికి వంద పర్సంటైల్‌.. వారిలో 10 మంది తెలంగాణ, ఏపీ నుంచే

  • ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున..

  • బాలికలు, ఈడబ్ల్యూఎస్‌ టాపర్లుగా రాష్ట్ర విద్యార్థులు ఆస్నా, సాయి రిత్విక్‌ రెడ్డి

  • ఇద్దరు ఏపీ విద్యార్థులకు 300/300 మార్కులు

  • అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు కటా్‌ఫల నిర్ధారణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్‌-2 పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించగా.. వారిలో ఏకంగా పది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారే కావడం విశేషం. ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ ఘనత సాధించారు. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్‌ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. కాగా వంద పర్సంటైల్‌ సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన మంథా శివ కామేశ్‌, దొరనాల భవితేశ్‌రెడ్డి, సాయి రిత్విక్‌ రెడ్డి, వివాన్‌ శరద్‌ మహేశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్‌, ఏపీకి చెందిన జొన్నల రోషన్‌ మణిదీ్‌పరెడ్డి, నరేంద్రబాబుగారి మహిత్‌, తుంగా దుర్గా సుప్రభాత్‌, పసల మోహిత్‌, బిజ్జం వెంకట చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. రాజస్థాన్‌ నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర, హరియాణాల నుంచి ఇద్దరు చొప్పున, ఛండీగఢ్‌, బిహార్‌, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున వంద పర్సంటైల్‌ సాధించిన వారిలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయి. గతేడాది జేఈఈ మెయిన్‌లో దేశవ్యాప్తంగా 14 మంది వంద పర్సంటైల్‌ సాధించగా వీరిలో రాజస్థాన్‌ నుంచి ఏడుగురు ఉన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ముగ్గురు చొప్పున ఉండగా.. ఏపీ నుంచి ఒక్కరే సాధించారు. ఈసారి రాజస్థాన్‌ను వెనక్కినెట్టి తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి.


వివిధ విభాగాల్లోనూ సత్తా

ఏపీకి చెందిన పసల మోహిత్‌, బిజ్జం వెంకట చంద్రశేఖర రెడ్డి మొత్తం 300లకు 300 మార్కులు సాధించారు. తెలంగాణకు చెందిన సాయి రిత్విక్‌ రెడ్డి.. ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమస్థానం, ఏపీకి చెందిన నరేంద్రబాబుగారి మహిత్‌ ఓబీసీ విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమస్థానం సాధించారు. బాలికల విభాగంలోనూ తెలంగాణ నెంబర్‌-1 ర్యాంకును కైవసం చేసుకుంది. రాష్ట్రానికి చెందిన మల్లవరపు ఆస్నా 99.99 స్కోరుతో మొదటిస్థానం సాధించారు. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరిల్లోనూ తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన దేవ శ్రీవేద్‌ ఎస్సీ క్యాటగిరిలో ఆలిండియా నెంబర్‌-1 ర్యాంకు సాధించగా ఐనగంటి అభిషేక్‌కాంత్‌, గంజి శ్రీజన్‌ 3, 4వ ర్యాంకులు సాధించారు. ఎస్టీ క్యాటగిరిలో తెలంగాణకు చెందిన మోకల శరత్‌చంద్ర ఆలిండియా 3వ ర్యాంకు సాధించారు. కాగా, తెలంగాణ నుంచి వంద పర్సంటైల్‌ సాధించిన ఐదుగురు విద్యార్థులూ హైదరాబాద్‌ నగరానికి చెందిన వారే కావటం విశేషం. నగరానికి చెందిన మరికొందరు విద్యార్థులు కూడా మెరుగైన పర్సంటైల్‌ సాధించారు. వారిలో సామవేదం రఘు కసిత్‌ (99.997), నియున్‌ కొచేట (99.996), సమృద్ధి భట్టాచార్య (99.988), రేవంత్‌ వంగల (99.982), సెట్టిపల్లి అన్వితారెడ్డి (99.915) ఉన్నారు. అన్వితారెడ్డి తెలంగాణ ఫిమేల్‌ టాపర్‌గా నిలిచారు. కాగా, దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్‌ సాధించిన 26 మంది విద్యార్థుల్లో 24 మంది జనరల్‌ క్యాటగిరి, ఒకరు ఈడబ్ల్యూఎస్‌, మరొకరు ఓబీసీ వర్గానికి చెందినవారు.

అడ్వాన్స్డ్‌ పరీక్షకు 2.5 లక్షల మంది అర్హత

జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించారు. జనవరిలో జరిగిన మొదటి సెషన్లో 13.04 లక్షల మంది హాజరవగా, ఈ నెలలో జరిగిన రెండో సెషన్లో 10.34 లక్షల మంది హాజరయ్యారు. రెండు దఫాలకు 8 లక్షల మంది హాజరయ్యారు. మెయిన్‌ ఫలితాల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షకు అర్హత సాఽధించిన విద్యార్థుల వివరాలను ఎన్‌టీఏ ప్రకటించింది. కటాఫ్‌ మార్కుల ఆధారంగా.. దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో జనరల్‌ విభాగం నుంచి 96,873 మంది, ఓబీసీ నుంచి 67,597 మంది, ఎస్సీ నుంచి 37,522 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 25,009 మంది, ఎస్టీ క్యాటగిరి నుంచి 18,790 మంది ఉన్నారు. మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 23 నుంచి మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

Updated Date - Apr 21 , 2026 | 04:25 AM