Share News

దళితులపైనే వైసీపీ స్వారీ

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:16 AM

వైసీపీ పాలనలో పేరుకే ‘‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’’ అని వినపడేది; స్వారీ మొత్తం దళితులపైనే. అయిదేళ్ళ పాలనలో వైసీపీ తన కక్షపూరిత లక్ష్యాల కోసం వాడుకున్నది దళిత ఐపీఎస్‌ అధికారులనే...

దళితులపైనే వైసీపీ స్వారీ

వైసీపీ పాలనలో పేరుకే ‘‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’’ అని వినపడేది; స్వారీ మొత్తం దళితులపైనే. అయిదేళ్ళ పాలనలో వైసీపీ తన కక్షపూరిత లక్ష్యాల కోసం వాడుకున్నది దళిత ఐపీఎస్‌ అధికారులనే. అయిదు కులాలకు అయిదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా, పరిపాలనా ‘కలశం’ ముగ్గురు నలుగురు రెడ్డి సామాజిక వర్గం వారి చేతుల్లో పెట్టారు. ‘నేనే రాజు, నేనే మంత్రి’ అన్నట్లు సకల శాఖలను సజ్జల రామకృష్ణారెడ్డి ఆధీనంలో పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాశ్‌ రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారే పెత్తనం చలాయించారు. ప్రభుత్వం మారి, కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం కుంభకోణంపై జరుగుతున్న సిట్‌ విచారణలో పట్టుబడుతున్న వారిలో అధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులే. రాజ్‌ కసిరెడ్డి దగ్గర నుంచి ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి వరకు అంతా వారే. అంటే డబ్బులున్న అట్టపెట్టెలు వారికే సొంతం. అప్పటి నరసాపురం ఎంపీ, ఇప్పటి డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్‌ నుంచి ఎత్తుకొచ్చి కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌, ఐజీ సునీల్‌నాయక్‌, మరో పోలీసు అధికారి జయపాల్‌ కింది కులాలకు చెందినవారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేసిన సీఐడీ డీఎస్పీ సంజయ్‌ కూడా దళితుడే.


అలాగే మరో కోణంలో చూస్తే– జగన్‌ పరిపాలనలో అసువులు బాసినవారూ ఎక్కువమంది దళితులే. డాక్టర్‌ సుధాకర్‌ నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు చెందిన మత్తు డాక్టర్‌. ఆయన చేసిన తప్పల్లా– ‘కరోనా మహమ్మారిలో మాస్కులు లేకుండా వైద్యం ఎలా చేయగలం?’ అని ప్రశ్నించటం. దీనికి రెండు చేతులను కట్టేసి, నడిరోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. పిచ్చోడు అన్న ముద్ర వేసి, కేసులు పెట్టి జైలుకు పంపారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసి భూమిపైనే లేకుండా చేశారు. కడపకు చెందిన పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ అచ్చెన్న హత్య చేయబడి వారం గడిచినా శవం ఆచూకీ తెలియరాలేదు. ఆయన మృతదేహాన్ని కుక్కలు ముట్టాయి. అంటే దళితుల అదృశ్య సంఘటనలపై అప్పటి ప్రభుత్వ దున్నపోతు నిద్ర ఏపాటిదో తెలియజేస్తోంది.ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసిన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి, స్విగ్గీ డెలివరీలా తన కారులో శవాన్ని అతని ఇంటికే డోర్‌ డెలివరీ చేశారు. అమరావతి ఉద్యమం చేస్తున్న కృష్ణయపాలెం ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి దాదాపు 30 రోజులు జైల్లో పెట్టారు. చేతులకు బేడీలు వేసి బస్సులో తిప్పారు. నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి లాంటి దళిత మహిళల అత్యాచారాలకు జరిగిన న్యాయం ఏమీలేదు. వీటితో పాటు కిరోసిన్‌ పోసి దహనం చేసిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌; ఎస్సీలపై, ఎస్టీలపై మూత్ర విసర్జన; చీరాల కిరణ్‌, కోడి కత్తి శీను, ‘శిరోముండనం’ ప్రసాద్‌ వంటి గొలుసుకట్టు ఘటనలు నాటి జగన్‌ పాలనలో దళితుల అమానవీయ గతికి గుర్తులుగా చెప్పొచ్చు. వైసీపీ సామాజిక న్యాయ నినాదం జగన్మోహన్‌రెడ్డి చెప్పుకునే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా సమాధి కట్టబడింది. చెప్పిన మాటకు, చేసిన చేతకు ఉన్న తేడా చరిత్ర మరువదు!

పోతుల బాలకోటయ్య

చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు

ఇవి కూడా చదవండి..

ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

Updated Date - Mar 18 , 2026 | 01:16 AM