రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ గొడ్డలి వేటు!
ABN , Publish Date - Jun 06 , 2026 | 01:59 AM
మూడు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, అభివృద్ధిలో రెండు విభిన్న దృక్పథాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి– సంపదను సృష్టించి అభివృద్ధికి పునాది వేయాలనే ఆలోచన కాగా...
మూడు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, అభివృద్ధిలో రెండు విభిన్న దృక్పథాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి– సంపదను సృష్టించి అభివృద్ధికి పునాది వేయాలనే ఆలోచన కాగా, రెండవది– వ్యవస్థలను కూలదోసి అభివృద్ధిని అడ్డుకొనే విధానం. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతికత, ఆధునికీకరణ, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. అప్పటివరకు వ్యవసాయాధారితంగా ఉన్న రాష్ట్రాన్ని సమాచార, సాంకేతిక రంగంలో దేశ పటంలో నిలబెట్టేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగానికి బలమైన పునాదులు వేయడం, ఈ–గవర్నెన్స్ సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి చర్యలు రాష్ట్రానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1991లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సరళీకృత ఆర్థిక సంస్కరణలను, రాష్ట్ర స్థాయిలో రెండవ సారి అమలు చేసి పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశారు. విజన్ లేని కార్యాచరణ కాలక్షేపం అవుతుందని 1998లో విజన్–2020 డాక్యుమెంట్‌ను చంద్రబాబు రూపొందించారు. దేశంలోనే ఇలాంటి విజన్ డాక్యుమెంట్‌ను తీసుకురావడం మొదటిసారి. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత ప్రగతిశీల, పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం; ఆర్థిక వ్యవస్థను 9 నుంచి 10శాతం వార్షిక వృద్ధి రేటు సాధించాలనేవి విజన్–2020 లక్ష్యాలు.
భారతదేశంలో నేరుగా ప్రపంచ బ్యాంకుతో సంప్రదింపులు జరిపి, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సంస్కరణల కోసం స్వతంత్రంగా రుణాలు పొందిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే. నష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును విడగొట్టి ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లుగా పునర్వ్యవస్థీకరించారు. నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ మిల్లులు, కర్మాగారాలను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించారు. 1995–2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలు మారి, హైదరాబాద్ గ్లోబల్ మ్యాప్‌లో చోటు సంపాదించింది. ఐటీ, బయోటెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జీఎస్‌డీపీ, ఆర్థిక వృద్ధిరేటు స్థిరమైన ప్రగతిని నమోదు చేశాయి. 1995–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సగటు వార్షిక వృద్ధి రేటు సుమారు 8.5 శాతం నుంచి 9శాతంగా నమోదైంది. సేవా రంగం, ఐటీ, టెలికాం రంగాల పుణ్యమా అని ఈ కాలంలో 7 నుంచి 8 శాతానికి పైగా వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోయింది. అప్పటి సంస్కరణలు దీర్ఘకాలిక ఫలితాలను ఇచ్చాయి. ఆనాడు వేసిన ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునాదులే నేటికీ హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి, ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు ప్రధాన వనరులుగా నిలిచాయి.
విజన్–2020 డాక్యుమెంటు ద్వారా ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధికి సిద్ధమైన సమయంలో ఎన్నికలు జరిగి తెలుగుదేశం అధికారం కోల్పోయి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. తర్వాత 2014లో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నది. అప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు, దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా మార్చేందుకు 2029 డాక్యుమెంట్‌ను తయారు చేసి కార్యాచరణ ప్రారంభించింది. రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఐదేళ్లలో దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ 12.2 శాతం వృద్ధి రేటు సాధించింది.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. విభజిత రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన ప్రణాళికలను, పునాదులను విధ్వంసం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చింది మొదలు దోపిడీకి ప్రణాళికలు వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్‌డీపీ ఆరు శాతం దిగువకు పడిపోయింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో అధ్వాన ఆర్థిక విధానాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్, జగన్ హయాంలో అప్పులకుప్పగా మారటాన్ని చూసి దేశం విస్తుబోయింది. అవినీతి, అసమర్థ, నియంతృత్వ, మూర్ఖపు చర్యలతో ఆర్థిక వ్యవస్థపై గొడ్డలి వేటు వేసి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టులోకి వెళ్లిపోయాయి. ప్రజా భవనాలన్నీ పరాధీనమైపోయాయి. పార్కులు, పాఠశాలలు, బస్టాండ్లు ప్రకృతి వనరులు పరుల పంచన బందీలయ్యాయి. రోజు గడవని ఆర్థిక పరిస్థితి ఏపీని అతలాకుతలం చేసింది.
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీశారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక దివాలా కోణానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం దిగజారింది. 2019 నాటికి రాష్ట్రం అప్పులు సుమారు రూ.3.75 లక్షల కోట్లు. 2024 జూన్ నాటికి అవి సుమారు రూ.11 లక్షల కోట్లకు పైగా పెరిగాయి. 1956 నుంచి 2019 వరకు 60 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.3.75 లక్షల కోట్లు కాగా, గత వైసీపీ ప్రభుత్వం తన అయిదేళ్లలో రూ.11 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. అంటే ఐదేళ్లలోనే దాదాపు రూ.6.50 లక్షల కోట్ల అదనపు అప్పులు చేశారు. బడ్జెట్ పరిమితులను మించి కార్పొరేషన్లు, మద్యం కార్పొరేషన్, సివిల్ సప్లైస్, ప్రభుత్వ ఆస్తులు, భవిష్యత్ మద్యం ఆదాయాలను కుదువబెట్టి చేసిన అప్పులే కాకుండా వివిధ విభాగాల్లో చెల్లించాల్సిన కాంట్రాక్టర్ల బకాయిలు, ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు లక్షల కోట్లు మిగిల్చి వెళ్లారు. తప్పుడు ఆర్థిక విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల 2019–24 మధ్య ఏపీ కోల్పోయిన సంపద జీఎస్‌డీపీ వృద్ధి అక్షరాలా రూ.7 లక్షల కోట్లు.
అధికారిక అప్పులను చూపిస్తూ, అనధికార అప్పులను దాచిపెడుతూ కాగ్‌ను సైతం తప్పుదారి పట్టించింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర మొత్తం నికర స్థూల ఉత్పత్తిలో జీఎస్‌డీపీలో అవి 35 శాతం మించకూడదని ఆర్థిక నిబంధన ఉన్నా, దానిని పట్టించుకోని ఫలితంగా 42 శాతం దాటి పోయిందని కాగ్ హెచ్చరించింది. 204, 205 రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘించి, శాసనసభను తప్పుదోవ పట్టించి, నిధుల వ్యయంలో విశృంఖలంగా వ్యవహరించారని కాగ్ తప్పు పట్టింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సైతం ఏపీ అప్పులపై అవాక్కయింది. గత ఐదేళ్లలో జరిగింది ఏమిటి? అప్పుల వృద్ధి తప్ప అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, రాజధాని లేదు, రాష్ట్రానికి ఆదాయం తెచ్చే నిర్మాణాలు లేవు. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్‌రెడ్డి గొడ్డలి వేటు వేశారు.
నిలకడైన ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం సాధ్యం అవుతుంది. స్వార్థ, అసమర్థ, అవినీతి నాయకులను అధికారానికి దూరంగా ఉంచడం ప్రజల బాధ్యత.
యనమల రామకృష్ణుడు
మాజీ ఆర్థిక మంత్రి
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు
కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు